మంత్రి అనుమతి లేకుండానే బిల్లుల చెల్లింపు

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వాకంపై ఆరా
లెక్కలు తీయాలని ఆదేశించిన ఆర్థికమంత్రి కేశవ్‌
అమరాతి,ఆగస్ట్‌29(జనంసాక్షి) : వైకాపా హయాంలో ఆర్థికశాఖ మంత్రి ఆమోదం లేకుండా జరిగిన బిల్లుల చెల్లింపుపై మంత్రి పయ్యావుల కేశవ్‌ విస్మయం వ్యక్తం చేశారు. అప్పటి ఆర్థికశాఖ మంత్రి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడే బిల్లులు విడుదల చేసినట్లు సమాచారం. గత తెదేపా ప్రభుత్వంలోని పనులకు బిల్లులు పెండిరగ్‌లో ఉండగా వాటిని పూర్తి చేయకుండా.. తర్వాతి వైకాపా ప్రభుత్వంలోని బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు. ఏ ప్రాతిపదికన ఈ చెల్లింపులు జరిగాయనే అంశంపై పయ్యావుల కేశవ్‌ ఆరా తీస్తున్నారు. యూసీల పేరుతో బిల్లుల చెల్లింపు జరిగిందనే వాదనను ఆర్థిక శాఖ వర్గాలు తెరపైకి తెచ్చాయి. మొత్తం ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చేందుకు మంత్రి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో చేసిన బిల్లుల చెల్లింపు అంశంపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ సీరియస్‌గా ఉన్నారు. తనకు తెలియకుండా నిధులు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. దాంతో ఉన్నతాధికారులు ఆగమేఘాల విూద ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరికి యూసీల పేరుతో బిల్లుల చెల్లింపు జరిగిందని వివరించారు. నిధుల విడుదలకు సంబంధించి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిధుల విడుదల కోసం అడిగింది ఎవరు..? ఏ అధికారుల ఆదేశాలతో రిలీజ్‌ అయ్యాయనే అనే అంశాలపై నివేదిక రూపొందిస్తున్నారు. ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అంద జేస్తారు. అసలు ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై వివరిస్తారు. సీఎంకు నివేదిక అందజేసిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. బాధ్యులపై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది.ఆ బిల్లులు ఎవరు చెల్లించారని సర్వత్రా చర్చ నెలకొంది. ఆర్థికశాఖ మంత్రి ఆమోదం పొందకుండా ఎలా బిల్లులు చెల్లిస్తారని చర్చ జరుగుతోంది. 2014లో తెలుగుదేశం హయాంలో పెండిరగ్‌ బిల్లులు ఉన్నాయి. వాటిని గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. అదే విషయాన్ని కొందరు టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ జిల్లా పర్యటనలో ఉండగా.. ఆయనకు తెలియకుండా ఎలా బిల్లులు విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జరిగిన తప్పిదంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తోంది.