మంత్రి గిరిరాజ్‌ సోనియాకు క్షమాపణ

1

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 20 (జనంసాక్షి):

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారం రేపాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్‌ సభ్యుడు జ్యోతిరాధిత్యసింధియా డిమాండ్‌ చేశారు. సోమవారం ఉదయం సభ మొదలవగానే ఈ అంశంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తిరస్కరించారు. దీంతో దీనిపై చర్చజరపాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు నిరసనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జ్యోతిరాధిత్య ఆరోపించారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్‌సింగ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. గందరగోళం మధ్య సభను స్పీకర్‌ కొద్దిసేపు వాయిదా వేశారు. చివరకు సోనియాపై చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పారు. నా మాటలు ఎవరినైనా బాధపెడితే క్షమించండి అని ఆయన అన్నారు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తలొగ్గి  సోనియా గాంధీకి మంత్రి క్షమాపణలు చెప్పారు. సోమవారం లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే  తమ అధినేత్రి సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి గిరిరాజ్‌ సింఘ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో సభను 20 నిమిషాల పాటు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన కొనసాగించారు. చివరకు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ క్షమాపణలు చెప్పారు. ఎవరినీ అవమానపరిచే ఉద్ధేశ్యం తనకు లేదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దీనితో వివాదం సద్దుమణిగింది. తెల్లతోలు వల్లే సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు అయిందని మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలసిందే.  మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ నైజిరీయా దేశస్తురాలిని వివాహం చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని మంత్రి విమర్శించడంపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్లమెంట్‌ లో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తొలుత సింగపూర్‌ నేత లీ క్వాన్‌ యూ, మరో ఇద్దరు మాజీ ఎంపీల మృతికి, సుక్మా, దంతెవాడల్లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జవాన్లకు స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సంతాపం ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌ సభ్యులు ఇచ్చిన తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ కు కాంగ్రెస్‌ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ విషయంపై కాంగ్రెస్‌ పక్ష నాయకుడు ఖర్గే మాట్లాడారు. ప్రభుత్వానికి చెందిన గిరిరాజ్‌ సింగ్‌, ఇతర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ మండిపడ్డారు. దీనిపై వెంటనే సంబంధిత మంత్రులు క్షమాపణలు చెప్పాలని, ప్రధాన మంత్రి ఈ విషయంలో స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ తరుణంలో మైక్‌ కట్‌ కావడంపై ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యుడు జ్యోతిరాదిత్య పేర్కొన్నారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, సాక్షాత్తూ కేంద్ర మంత్రికే రక్షణ కరువైందన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సోనియాను అవమానించారని, ప్రధాని బీజేపీ ఎంపీలను, కేంద్ర మంత్రులను కట్టడి  చేయడం లేదన్నారు. దీనికి ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నపుడు ఆయన మంత్రివర్గ సభ్యుడు తమ అధినేత్రి సోనియాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాథిత్య సింథియా ఆరోపించారు.  మంత్రి తన వ్యాఖ్యలపై కేవలం క్షమాపణ చెబితే సరపోదని ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సింథియా డిమాండ్‌ చేశారు. గిరిరాజ్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి సోనియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు చేసిన డిమాండ్లపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఎవరూ కూడా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదన్నారు. స్పీకర్‌ అనుమతితో అనుచిత వ్యాఖ్యలపై చర్చిద్దామని వెంకయ్య

సూచించారు. కానీ ప్రధాన మంత్రిని ఈ వివాదంలో ఎందుకు లాగుతారని విపక్షాలపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ తమకు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ సభ్యులు నినాదాలతో ¬రెత్తించారు. ఈ మధ్యలోనే స్పీకర్‌ ప్రశ్నోత్తారాలను చేపట్టారు. సభలో పరిస్థితిలో మార్పు రాకపోవడంతో స్పీకర్‌ 20 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.