మంత్రి పదవి దక్కలేదని..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అసంతృప్తి

కర్ణాటక కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట ఆందోళన
బెంగళూరు,జూన్‌7(జ‌నం సాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి 25 మందితో నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఆ మంత్రిమండలిలో తమకు చోటు దక్కలేదని ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుఆరోపిస్తున్నారు. 14మంది కాంగ్రెస్‌ సభ్యులకు, తొమ్మిదిమంది జేడీఎస్‌ సభ్యులకు, బీఎస్పీ, కేపీజీపీ నుంచి ఒక్కొక్కరికీ మంత్రివర్గంలో చోటుదక్కింది. బుధవారం రాజ్‌భవవన్‌లో గవర్నర్‌ వాజుబాయివాలా నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని దేవెగౌడ పెద్దకుమారుడు రేవణ్ణ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌, మహిళా ఎమ్మెల్యే జయమాల(కాంగ్రెస్‌) ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. అధికార పంపకాలలో భాగంగా కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు దక్కాయి. కానీ కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేలకు చెందిన మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే రామలింగా రెడ్డి, ఎమ్మెల్యే రోషన్‌ బెయిగ్‌లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. కర్నాటక కాంగ్రెస్‌ కమిటీ ఆఫీసు ముందు రోషన్‌ బెయిగ్‌కు చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు.