మగువల మనసుదోచే మల్లియలు

ఖమ్మం, జనవరి 30 (): వేసవి వచ్చిందంటే మల్లెల సౌరభాలు గుభాళిస్తాయి. మగువల మనుసును ఇట్టే ఆకర్షించే తెల్లని రంగులో పరిమళాలు వెదజల్లే పుష్పాలు మల్లెల్లే అంటే అతిశయోక్తి కాదు. మల్లె విరిసింది.. సుమధురపు ఝల్లు కురిసింది… అంటూ ఉత్సాహంగా.. ఉల్లాసంగా పాడుకోవాలంటే మల్లెపూల పరిమళాన్ని ఆస్వాదించాల్సిందే. మండపాల అలంకరణలో మల్లెపూలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పెళ్లిలకు, పేరంటాలకు వెళ్లే మహిళలు కేశాలంకరణలో మల్లెపూలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ధర ఎక్కువగా ఉన్నా మల్లెలకే ప్రాధాన్యతనిస్తున్నారు. అందం.. ఆనంవంతో పాటు ఆరోగ్యానికి మల్లెలే ఉపకరిస్తాయని అంటున్నారు. యువత సైతం స్పెషల్‌గా జాస్మీన్‌ పెర్‌ప్యూమ్‌లనే వాడుతామంటున్నారు. ఏదేమైనా సీజనల్‌ వ్యాపారులు మాత్రం ఈ   మల్లెల అమ్మకాలపైనే బతికేసామంటున్నారు.     మల్లెదండలకు గిరాకీ బాగానే ఉంది. పూల వ్యాపారులు హైదరాబాదు, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. విడి పూలు కేజీ రూ.250 నుంచి రూ.350 వరకు అమ్ముతున్నారు. పూల జడ రూ. 250, పెళ్లి దండలు రూ. 700 ధర పలుకుతున్నాయి.