మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు కూలీల మృతి
– మృతులంతా ఒడిశాకు చెందిన వారే
– సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన
సంగారెడ్డి, మే8(జనం సాక్షి) : పనికోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ముగ్గురు కూలీల బతుకులు అర్ధాంతరంగా ముగిశాయి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల శివారు గాడియం అంతర్జాతీయ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనుల్లో భాగంగా మట్టి పెళ్లలు విరిగిపడి ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాకు చెందిన వికాస్, ప్రకాష్, మానస్ అనే ముగ్గురు కూలీలు పాఠశాలలో మురుగు కాలువ నిర్మాణం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం సాయంత్రం సమయంలో దాదాపు 9 అడుగులు ఉన్న గుంతలో పైపులు అమరుస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కూలిపోయాయి. ఆ సమయంలో వారు కూర్చుని ఉండటంతో లేవలేకపోయారు. పక్కనే పనిచేస్తున్న ఇద్దరు కూలీలు గట్టిగా కేకలు వేయడంతో వెంటనే జేసీబీతో మట్టిదిబ్బలు తొలగించి వారిని బయటకు తీశారు. హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. వారు అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన విూడియాను పాఠశాల యాజమాన్యం అనుమతించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.