మతం వ్యక్తిగతం.. రాజ్యం జోక్యం తగదు

5
– మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ నవంబర్‌6(జనంసాక్షి):

మతం వ్యక్తిగత అంశమని, అందులో రాజ్యం సహ ఎవరూ జోక్యం చేసుకోలేరని, దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం ద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధికి అవరోధం కలిగిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.  మతాన్ని ఆధారంగా చేసుకుని విధాన నిర్ణయాలు రూపొందించుకోకూడదని ఆయన పిలుపు ఇచ్చారు. ఇటీవలి విషాదకర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, భావప్రకటనా స్వేచ్ఛను, మత విశ్వాసాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మన్మోహన్‌సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హింసాత్మక, తీవ్రవాద మూకలు ఈ పని చేస్తున్నాయని ఆయన అన్నారు. వారి ఆలోచనతో విభేదించే ఆలోచనాపరుల్ని చంపేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలు న్యాయసమ్మతం కాదని మన్మోహన్‌ అన్నారు. తిరస్కరించే హక్కును ఎరూ కాలరాయలేరని, ఇది మన జాతీయతపైనే దాడి లాంటిదని ఆయన అన్నారు.