మతిస్థిమితం లేని మాటలు మానుకో కావూరిపై పొన్నం, వివేక్‌ల ఫైర్‌

హైదరాబాద్‌,జనవరి8 (జనంసాక్షి):
పదవి రాకపోయే సరికి ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు పార్టీనే తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. పదవి వస్తే ఓలాగా లేకుంటే మరోలా వ్యవహరించడం వారికి అలవాటేనన్నారు. తనకు మంత్రి పదవి రాకపోయేసరికి దద్దమ్మ ప్రభుత్వం అని కావూరి విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్‌ను అడ్డుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించని కావూరి ఇప్పుడు తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర జిల్లాలన్నీ తిరుగుతున్నాడని తెలిపారు. సీమాంధ్ర నేతలు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌, గాదె వెంకటరెడ్డి, కాసు కృష్ణారెడ్డిలపై ఆయన విరుచుకుపడ్డారు. తనకు పదవి రాకపోయేసరికి ఎంపీ కావూరి పార్టీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడితే నగరంలో ఉన్న సీమాంధ్ర ప్రజలు
భయపడాల్సిన పనిలేదని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధమయ్యారని ఆయన వెల్లడించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు నష్టమేమిలేదనే విషయాన్ని సీమాంధ్రులు గుర్తించారని, ప్రత్యేక రాష్టాన్న్రి అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తోన్నారని వివరించారు. తెలంగాణలో హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్నప్పుడే అసెంబ్లీ, హైకోర్టు ఉందని వివేక్‌ అన్నారు. ఇక్కడ వారికి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు.