మతోన్మాదం పొంచి ఉంది..
` గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు..వారంరోజుల్లో జీవో విడుదల
` దళితబంధు తరహాలో గిరిజనబంధు అమలు
` సంపద పెంచడం..పేదలకు పంచడమే మా విధానం
` ప్రకృతి సంపద ఉన్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం
` దేశంలోని నీరంతా పొలాలకు మళ్లాల్సిందే
` ప్రతి బోరుకు కరెంట్ చేరితేనే దేశం సస్యశ్యామలం
` కార్పోరేట్లకు దోచిపెట్టే విధానం పోవాలి
` తెలంగాణ విధానమే దేశానికి దిక్సూచి
` బంజారాల సదస్సులో కేంద్రాన్ని కడిగేసిన కెసిఆర్
` మోడీ, అమిత్‌షా విధానాలను తూర్పారాబట్టిన సిఎం
` పోడు సమస్యలకుత్వరలోనే పరిష్కారం
` దేశ వ్యాప్తంగాగిరిజనలందరికీ సమాన హోదా
` అందుకోసం పోరాటం చేస్తాం
` కుమ్రంభీమ్, బంజారా భవన్‌లను ప్రారంభించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్(జనంసాక్షి): దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిందేనని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం గిరిజనులను, ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం. ఇక విసిగి పోదల్చుకోలేదు. మేం వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తాం. నంరేంద్ర మోదీ జీవోను గౌరవిస్తావా.. ఆ జీవోనే ఉరి తాడు చేసుకుంటావా? అని మనవి చేసుకుంటున్నాం అంటూ కొంచెం గట్టిగానే హెచ్చరిం చారు. ఇప్పటికే విూతో విసిగి పోయాం.. ఇక వేచి చూడలేం. వారం రోజుల్లో తప్పకుండా జీవో విడుదల చేసేస్తాం. దాన్ని అమలు చేసి గౌరవం కాపాడుకుంటావా? లేదంటే దాన్ని ఉరి తాడు చేసుకుంటావా? ఆలోచించుకోవాలి మోదీని కేసీఆర్ గట్టిగానే హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు మన గిరిజనజాతి 6 శాతం రిజర్వేషన్లు పొందింది. ఆ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఏడు సంవత్సరాలు గడిరచింది. ప్రధాని మోదీని అడుగుతున్నప్పటికీ స్పందన లేదు. విభజన రాజకీయాలు మొదలు పెట్టిన అమిత్ షాను అడుగుతున్నాం. విూకేం అడ్డం వస్తుంది. ఎందుకు ఆపుతున్నారు. రాష్ట్రపతి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేస్తాం. బ్రహ్మాండంగా రిజర్వేషన్లు అమలవుతాయి. ఎందుకు తొక్కిపెడుతున్నారు. చేతులు జోడిరచి మోదీని అభ్యర్థిస్తున్నా. మా బిల్లుకు రాష్ట్రపతి ముద్ర వేసి పంపించండి అని కోరుతున్నా. రాష్ట్రపతిగా కూడా ఆదివాసీ బిడ్డనే ఉన్నారు. ఆమె బిల్లును ఆపకపోవచ్చని అన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా 50 శాతానికి రిజర్వేషన్లు మించొద్దని లేదు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు. ఎందుకు చేతులు రావడం లేదు. ఈ సభ ఏకగ్రీవ తీర్మానం చేస్తోంది. మా బిల్లుకు రాష్ట్రపతి ముద్రవేసి పంపించాలని కోరుతున్నాను. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్నారు. మాకు వచ్చే న్యాయమైన హక్కు అడుగుతున్నాం. రిజర్వేషన్ల విషయంలో పలుమార్లు నేను స్వయంగా మోదీని అడిగాను. రిజర్వేషన్లు మా న్యాయం, ధర్మం అని అడిగాను. ఏపీ నుంచి విడిపోయిన తర్వాత 6 నుంచి 10 శాతానికి గిరిజనులు పెరిగారని చెప్పినప్పటికీ ఇవ్వట్లేదు. ఈ దేశంలో 8 సంవత్సరాల్లో ఏ వర్గం ప్రజలకైనా మంచి పని చేసిందా? మనం కూడా ఈ దేశంలో భాగమే కదా? మన హక్కులు ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి సహా అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని గిరిజన బిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో శుభవార్త వినిపించారు. దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధును అమలు చేసి తీరుతామని ప్రకటించారు. గిరిజనుల అభ్యున్నతే తమ లక్ష్యమని కేసీఆర్ తేల్చిచెప్పారు. పోడు భూములు పంచిన తర్వాత అసలు భూములు లేని గిరిజనులను తేలుద్దాం. ఆ లెక్కను చూసిన తర్వాత దళితబంధు మాదిరిగా గిరిజన బంధును కూడా అమలు చేయ బోతున్నాం. భూమి, భుక్తి లేకుండా, ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజన బంధును తన చేతుల విూదుగా ప్రారంభిస్తాను. సాధించుకున్న స్వరాష్ట్రంలో కులం మతం జాతి అనే బేధం లేకుండా జీవించాలి. ఈ దేశానికి మనం వెలుగు దివిటీలం కావాలి. అవినీతి రహితంగా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. సత్యవతి రాథోడ్ పోడు భూములపై ఏర్పాటు చేసిన కమిటీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చున్న విూటింగ్‌లో చెప్పాను. భూములు ఎంత వరకు ఉన్నాయో చూద్దాం. పోడు భూములు పంచిన తర్వాత.. అస్సలు భూములు లేకుండా ఉన్న గిరిజనులెవరో చూద్దాం. ఆ లిస్ట్‌ను తెప్పించాలని సీఎస్‌కు చెప్పా. ఆ లిస్ట్ ఒకసారి వస్తే ఏదైనా దళితబంధ.. ఇంటికి రూ.10లక్షలు ఇచ్చి ఆదుకున్నమో.. గిరిజనబంధు కూడా స్టార్ట్ చేయబోతున్నామన్నారు. తప్పకుండా భూమిలేకుండా, భుక్తి లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజనబిడ్డలకు సైతం గిరిజనబంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని హావిూ ఇస్తున్నా. వెలుసుబాటు కూడా చూసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సాధించుకున్న స్వరాష్ట్రంలో కులం, జాతి, మతం అనే బేధం లేకుండా అందరం అన్నదమ్ముళ్లా మనం కలిసి జీవించాలే. ఒకరినొకరు ప్రేమించుకునే గొప్ప సమాజం నిర్మాణం కావాలే. దేశానికి వెలుగు దివిటీలను కావాలని ముందుకుసాగుతున్నాం అన్నారు. అమాయకులైన గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. వారికి ఇవ్వడానికి భూములు గుర్తించాం. కమిటీలు ఏర్పాటు చేశాం. అందుకు సంబంధించిన 140 జీవో జారీ చేశాం. అందరూ యాక్టివ్‌గా ఉండి నివేదికలు పంపిస్తే పట్టాలిస్తాం. గిరిజన సోదరుల కోసం తండాలను పంచాయతీలుగా చేశాం. తండాలు, ఆదివాసీ గూడెంలలో వారే పరిపాలించుకుంటున్నారు. మూడు ఫేజుల కరెంట్ ఇస్తున్నాం. గురుకులాలను ఏర్పాటు చేశాం. రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా తండాలకు, గూడెంలకు మంచినీరు అందిస్తున్నాం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఇచ్చే నీళ్లే.. ఆదిలాబాద్ గూడెల్లో, అచ్చంపేట చెంచు పెంటల్లో కూడా అందిస్తున్నాం. తండాల్లో విషజ్వరాలు లేవు. ఆకలి చావులు లేవు. కడుపు నిండా అన్నం పెడుతున్నాం. అన్ని పథకాలు అందుతున్నాయి. ఉన్నంతలో మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గిరిజన సంస్కృతిని కాపాడుతున్నాం. అనేక పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నాం. మనకు అధికారం రావడంతో ఈ కార్యక్రమాలను సఫలికృతం చేసుకుంటున్నాం. మన జాతి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
సంపద పెంచడం..పేదలకు పంచడమే మా విధానం
సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే మన సిద్దాంతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్టాన్రికి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వకుండా, పేదల ప్రజల ఉసురు పోసుకుంటు న్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘దేశంలో ఎన్నో సమస్యలున్నయ్. దేశంలో విపరీతమైన దేవుడు ఇచ్చిన ప్రకృతి సంపద ఉన్నది. నదుల్లో నీరు ఉన్నది. పుష్కలంగా కరెంటు ఉన్నది. ఏడేళ్ల కిందట మన బతుకు ఎట్ల ఉండేనో ఆలోచించాలన్నారు. ఇవాళ కష్టపడ్డం. మన చేతుల్లో ఉంది కాబట్టి చేసుకున్నం. దాన్ని బతకనివ్వకుండా ప్రతి బోరుకు పెట్టాలే.. ముక్కు పిండి ప్రజల వద్ద పైసలు వసూలు చేయాలంటున్న ఈ మోదీ, ఇలానే అనేక విషయాల్లో సులభంగా పరిష్కరించే విషయాల్లో తాత్సారం చేస్తూ దేశాన్ని, ప్రజలను గాలికి వదిలేస్తున్నరని మండిపడ్డారు. తమకు ఇష్టమైన వ్యక్తులు, కోటీశ్వరులకు, షావుకార్లకు దేశ సంపదను దోచిపెడుతూ ప్రైవేటైజేషన్ పేరిట లక్షల కోట్ల ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్న దుర్మార్గం పోవాలని అన్నారు. ప్రజారాజ్యం, రైతుల రాజ్యం, దేశం కొంత పుంతలు తొక్కాలే. దేశ నదుల్లో ప్రవహించే నీరు సముద్రం పాలుకాకుండా రైతుల పంటపొలాల్లోకి రావాలి. తెలంగాణలో జరిగే ప్రయత్నమే భారతదేశమంతా జరగాలని అన్నారు. ఖచ్చితంగా తెలంగాణ జాతిగా భారత రాజకీయాలను ప్రభావితం చేయాల్సిందేనని అన్నారు. అవసరమైన సందర్భంలో ఏవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేశామో.. ఈ దేశంలో జరిగే మతపిచ్చి కలహాలను, కుట్రలను, విద్వేష రాజకీయాలను తప్పకుండా బద్దలుకొట్టాల్సి ఉందన్నారు. మహాత్ముడు సాధించిన ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత పౌరులుగా మన కర్తవ్యం అన్నారు. పొరపాటు జరిగితే 58 సంవత్సరాలు గోసపడ్డం. మంచినీళ్లకు, కరెంటు, ఉద్యోగానికి వలసలు పోయామన్నారు. 20 ఎకరాలున్న రైతు హైదరాబాద్‌లో ఆటోలు నడిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బతుకు ఈ సమైక్య రాష్ట్రంలో బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్లు అయ్యింది.. రాష్ట్రం వస్తే బాగుపడుతాం అని చెప్పాం. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నం. పేదలకు అన్నం పెట్టుకుంటున్నం’ అని తెలిపారు. ఈ రోజు గర్వంగా ఉన్నది. ఈ సభలో చీఫ్ సెక్రెటరీ పిలిస్తే.. మా చిన్నారి విద్యార్థులు బ్రహ్మాండమైన కేరింతలు కొట్టారు. గిరిజన గురుకులాల విద్యార్థులు 200 మంది డాక్టర్లు, వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన వారంతా ఉన్నారు. విూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న. విూరు ఇంకా బంగారు బిడ్డలు, తెలంగాణ బిడ్డలుగా ఈ భారత జాతి ప్రతినిధులుగా ఎదగాలి. విూ గురించి ప్రభుత్వం ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంది. ఇంకా గురుకులాలను పెంచుతాం. గిరిజన ఆడ బిడ్డలు బాగా చదువుకోవాలని ఆశించారు. ఇంకా గిరిజన గురుకులాలు ఈ సంవత్సరం మంజూరు చేసుకునే ఆలోచన చేస్తున్నాం. బాలికలు, బాలుర కోసం ఏ ఒక్కరు చదువురాకుండా ఉండకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్. విద్యావంతులైన గిరిజన బిడ్డలు ఎక్కడ ఉన్నరు అంటే భారతదేశంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నరు అనే పేరు, కీర్తి, ప్రతిష్ట సాధించాలని హృదయపూర్వకంగా కోరుతున్న. నేను కోరేది ఒకటే. ఎంతో కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఏవిధమైన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం జరుగుతుందో అందరూ కళ్లారా చూస్తున్నరు. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పెంచడమే మన సిద్దాంతం’అని సీఎం పేర్కొన్నారు. కఠోరమైన దీక్ష, క్రమ శిక్షణ, అవినీతిరహితంగా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ముందుకు కదిలిపోతున్నం. విూ అందరి ఆశీర్వచనంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హావిూలు, పాలసీలు విజయవంతమై పారిశ్రామికరంగం, ఐటీ రంగం, ఉద్యోగ కల్పన రంగం, వ్యవసాయరంగం దేశంలోనే అగ్రగామిగా ముందుకుపోతున్నం. 24గంటల కరెంటు అందరికీ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రంగా వెలుగొందుతున్నం. తెలంగాణ సమాజం ఐక్యత, ప్రగతి పరుగులు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దన్నారు. దుర్మార్గులు, నీచ రాజకీయ నాయకులు వారి సంకుచిత స్వార్థం కోసం చెలరేగొట్టే మత పిచ్చి మనకు అంటుకుంటే మనం ఎటుకాకుండా పోతాం. విూ బిడ్డగా, తెలంగాణ సాధించిన వ్యక్తి, ఈ గడ్డ మట్టిలో పుట్టిన వ్యక్తిగా విూ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మళ్లీ కల్లోలానికి గురికావొద్దు.. గురికానివ్వొద్దు. విద్యావంతులు, మేథావులు, బుద్ధిజీవులు ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసి సమాజానికి కాపలాదారులుగా ఉండాలని అన్నారు. ఈ సమాజాన్ని శాంతి, సుఖంతోని సర్వమానవ సౌభాతృత్వంతో బ్రహ్మాండంగా పురోగమించే దిశగా తీసుకోపోయేదాంట్లో నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా. ప్రజల పక్షాన ఉంటా. తాడిత పీడిత ప్రజల కోసం ఈ దేశంలోని యావత్ అణచివేయబడ్డ జాతుల కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారిని సమున్నతంగా గౌరవించేవిధంగా తెలంగాణ ప్రధాన పరిపాలనమైనటువంటి సచివాలయానికి అంబేద్కర్ గారి పేరును పెట్టుకున్నాం.ఈ రకంగా అన్నివర్గాలను గౌరవించుకుంటూ, అందరం కలిసి ఆనందంగా, సంతోషంగా, అన్ని సంస్కృతులు, పండుగలు, జాతర్లను గొప్పగా నిర్వహించుకుంటూ.. ఆడుతూ పాడుతూ ఈ సమాజం శాంతియుతంగా ముందుకు సాగాలె. అదే నా గుండెలనిండ ఉన్న కోరిక. దేవుడు ఇచ్చిన శక్తిని వినియోగించి విూ సేవలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి అభ్యుదయం గురించి పని చేస్తా. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన దీవించిన విూ అందరికి పేరుపేరునా ధాన్యవాదాలు.. రాం రాం.. జైహింద్.. జై తెలంగాణ’ అని నినదిస్తూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.
కుమ్రంభీమ్, బంజారా భవన్‌లను ప్రారంభించిన సిఎం
పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారం చేసుకోబోతు న్నామని కేసీఆర్ ప్రకటించారు. బంజారా ప్రజాప్రతినిధులంతా యాక్టివ్‌గా ఉండి.. పోడు భూముల పరిష్కారంలో చొరవ తీసుకోవాలన్నారు. మన బిడ్డలకు న్యాయం జరిగేలా చూడాలని విూ అందర్నీ కోరుతున్నాను. అడవులు, తండాల్లో ఉన్న మన బిడ్డలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వెళ్తున్నారు. వారి బతుకులను బాగు చేసేందుకు ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చలు ఈ భవనం నుంచి జరగాలని కోరతున్నాను. మన రాష్ట్రంలో గిరిజన బిడ్డలు ఎస్టీలు.. మహారాష్ట్రలో బీసీలు. ఇంకో చోట ఓసీలు కూడా ఉన్నారు. ఇట్ల రకరకాలుగా విభజనలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉండే గిరిజన బిడ్డలందరికీ సమాన హోదా వచ్చే కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ రోజు బంజారాహిల్స్‌లో ఇంత చక్కటి బంజారా భవన్ నిర్మాణం చేసుకోని నాచేతులుతో ప్రారంభింప జేసుకున్నందుకు మంత్రి సత్యవతి రాథోడ్‌కు, బంజారా ప్రజాప్రతినిధులకు, యావత్ తెలంగాణ రాష్ట్ర బంజారా బిడ్డలందరికీ హృదయపూర్వకంగా, సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ వస్తే ఏం జరుగుతదనే మాట ఉద్యమ సందర్భంలో చాలా చోట్ల చెప్తూ వచ్చాను. అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. మన రాజధాని నగరంలో బంజారాహిల్స్ అనే గొప్ప ప్రాంతం ఉంటది. కానీ బంజారాలకే గజంజాగ లేదని చెప్పాను. ఆ మాట తారుమారు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా భవనం నిర్మించుకున్నాం. మనం ఈ రోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట పట్టాయి. అన్ని చోట్ల గిరిజన బిడ్డలకు గౌరవం లభించే విధంగా దశ దిశ చూపిస్తుందని భావిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతో మంది బంజారా బిడ్డలు ఉత్తమమైన సేవలు అందిస్తున్నారు. అనేక రంగాల్లో అనేక హోదాల్లో పని చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని నీటి పారుదల శాఖలో మన బంజారా బిడ్డ హరే రామ్ అందించే సేవలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అలా అనేక రంగాల్లో అనేక మంది అధికారులు ఉన్నత స్థాయిల్లో పని చేస్తున్నారు. నేను విూ అందరితో ప్రార్థించేది ఒక్కటే. సమస్యలు మనకు చాలా ఉన్నాయి. ఈ భవనం కట్టుకొని సంతోషపడితే అయిపోదు. బంజారా జాతికున్న ఒక విశిష్టత, గొప్పతనం ఏంటంటే రకరకాల వారికి రకరకాల భాషలుంటాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉండే బంజారా బిడ్డలకు, మన దేశంలో ఏ రాష్ట్రంలోకి పోయినా కూడా భాష మాత్రం లంబాడా భాష ఒక్కటే ఒక్కటి ఉంది. దాదాపు 28 నుంచి 30 దేశాల్లో మాట్లాడే భాష కూడా మన తెలంగాణ, మన తండాల్లో మాట్లాడిన భాషనే అక్కడ మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార్యం, ప్రత్యేకమైన జీవన విధానం, ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన పద్ధతుల్లో జీవించే ఆత్మగౌరవం, విశిష్ఠమైన సంస్కృతిని ఆ పరంపరను ఈ
రోజు వరకు కూడా మన బంజారా బిడ్డలు కాపాడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఏదో తమాషాకు పెళ్లిళ్లు చేసుకోవడానికో, ఇంకోటి చేసుకోవడానికో కట్టిన హాల్స్ కాదు. ఇంత మంచి హాల్‌లో చక్కటి సమావేశాలు జరగాలి. ఏ జిల్లాలో, ఏ తాలుకాలో, ఏ తండాలో ఏ సమస్యలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా రూపుమాపాలి. ఏ విధంగా ప్రభుత్వం సేవలు తీసుకోవాలి. ఇక్కడ ఒక కమిటీలాగా పెట్టి ఎక్కడ ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా ఇక్కడ్నుంచి గద్దల్లా పోయి వారికి రక్షణగా ఉన్నప్పుడే ఈ భవనానికి సార్థకత లభిస్తుంది. గిరిజన బిడ్డల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆదివాసీ బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ `10లో నూతనంగా నిర్మించిన కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. పోడు భూముల సమస్యను కూడా అందరూ కలసి పరిస్కరించడంలో సహకరించాల న్నారు. ఇల్లలకగానే పండగ కాదన్నట్లుగా..భవన్‌ల ప్రారంభంతో వారి కష్టాలు తీరలేదన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆదివాసీ, గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం.. వారి ఆత్మగౌరవ ప్రతీకలుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో కుమ్రం భీమ్ ఆదివాసీ, సంత్ సేవాలాల్ బంజారా భవనాలను నిర్మించింది. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్ హాల్స్, వీఐపీ లాంజ్‌లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని గోండు, కోయ, పర్దాన్, థోటి, నాయక్‌పోడ్, చెంచు ఇలా 10 ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాలు రూపుదిద్దుకున్నాయి. బంజారా భవన్‌లో లంబాడీల జీవన విధానం, సంస్కృతిని తెలిపే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ఆదివాసీ గిరిజన బిడ్డలు, లంబాడీ బిడ్డలు అందరికీ కూడా మేం తల ఎత్తుకుని ఇది మా రాష్ట్రం, ఇది మా కుమ్రం భీం ఆదివాసీ భవన్ అని చెప్పుకునేటటువంటి మంచి కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మాణం చేసుకున్నాం. చాలా చాలా సంతోషం. భవనం కట్టుకోగానే అయిపోదు. ఇల్లు అలకగానే పండుగ కాదు. గిరిజన బిడ్డల సమస్యలు తీరవలసిన అవసరం ఉంది. కొంత కొంత ఒక్కో అడుగు పడుతుంది. చదువుకునే విషయంలో కానీ, విదేశాలకు వెళ్లే విషయంలో కానీ, గిరిజన పోడు భూముల విషయంలో కానీ, ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో కానీ, కొద్దిగా మనం పురోగమిస్తున్నాం. ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. ఈ భవనం యావత్ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆదివాసీ బిడ్డల హక్కుల పరిరక్షణ వేదిక కావాలన్నారు. మంత్రులు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.