మత్స్యకార సొసైటీల్లో న్యాయం చేయాలి

ఆదిలాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలో అధికంగా ఉన్న ముదిరాజ్‌లకు వెంటనే మత్స్యకార సంఘాల్లో సభ్యత్వం కల్పించాలన్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలలోని ముదిరాజ్‌లకు మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దీనిపై చర్చించేందుకు
ముదిరాజ్‌ కులస్తులకు మత్స్య పారిశ్రామిక అవగాహన సదస్సును  నిర్వహించనున్నట్లు ముదిరాజ్‌ మహాసభ  జిల్లా నాయకులు  తెలిపారు. ముదిరాజ్‌ మత్స్య పారిశ్రామిక విధానం, సభ్యత్వ నమోదు, కొత్త సంఘాల ఏర్పాటు, చెరువులపై మధ్య దళారుల ఆధిపత్యం తదితర సమస్యలపై చర్చించి ముదిరాజ్‌లకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.  రాష్ట్రంలో 4 వేల మత్స్య సహకార సంఘాలుండగా.. 3600 ముదిరాజ్‌లవేనన్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ ముదిరాజ్‌లను మత్స్య కార్మికులుగా గుర్తించినా.. అధికారుల నిర్లక్ష్యంతో ముదిరాజ్‌లకు సభ్యత్వం, చెరువులో వాటా, చేపలు పట్టేందుకు లైసెన్సులు మంజూరు కావడం లేదన్నారు. దీనిపై చర్చించి ప్రభుత్వానికి వినతిపత్రం అందచేస్తామని అన్నారు.