మత ఘర్షణల రాజ్యం.. వాక్ స్వాతంత్య్రం పూజ్యం
– మోడీ పాలనపై సోనియా ఫైర్
పాట్నా అక్టోబర్17(జనంసాక్షి):
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ రోజు ఆమె బిహార్‌లోని బక్సార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని ఎన్డీయే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఎన్టీయే అధికారంలోకొచ్చాక దేశంలో మళ్లీ మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని వీటిలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మేధావులకు సైతం వాక్ స్వాతంత్రం లేకుండా పోయిందన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బక్సర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందన్నారు. అందువల్లే మోదీ ప్రధాని కాగలిగారని చెప్పారు. అయితే ఇటీవల మతపరమైన ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యులర్ శక్తులను బలోపేతం చేసేందుకే లాలూ, నితీశ్‌లతో కలిసి బిజెపిపై పోరాడుతున్నామని సోనియా చెప్పారు. బీహార్‌లో ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిశాయి.