మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ పేర్లు నమోదు చేసుకోవాలి

మెదక్‌, జనవరి 28 (): మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టంలో గర్భవతులు,పిల్లల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నుండి వైద్య శాఖ సిబ్బందితో నిర్వహించిన సెట్‌కాన్షరెన్స్‌లో మాట్లాడుతూ మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టంలో ఇంకా 4,300మంది గర్భవతులు, 9500మంది పిల్లల పేర్లు నమోదు చేయాల్సి ఉందని అదే విధంగా 39,381మంది గర్భవతుల సేవలు, 1,12,400మంది పిల్ల సేవల వివరాలు నమోదు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ వివరాలన్నింటిని రెండురోజులలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈనెల 24న నిర్వహించి సెట్‌కాన్షరెన్స్‌ నుండి ఈ రోజు వరకు ఎలాంటి పురోగతి లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

ఏప్రిల్‌ 2013 నుండి జననీ సురక్ష యోజన(జెఎస్‌వై) కింద ఇచ్చే పారితోషికం లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందని, ఏప్రిల్‌ మాసంనుండి ప్రసవించే ప్రతి గర్భిణీ ఆధార్‌ నంబర్‌, వ్యక్తిగత బ్యాంకు ఖాతా నెంబర్‌ వివరాలు మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టంలో విధిగా నమోదు చేయాలని ఆయన వైద్యసిబ్బందికి ఆదేశించారు. మాస్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎండిఏ) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని అందరూ వైద్య సిబ్బంది పూర్తిగా కృషి చేయాలన్నారు.
ఎండిఎ, మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టంలో అతి ముఖ్యమైనందున ఓచర్లు ఎయిర్‌టెల్‌ ఫోన్‌ బిల్లలు సమర్పించేందుకు ఈ నెల 31వరకు పెంచామన్నారు. ప్రతి పిహెచ్‌సిలో వెబ్‌ కెమెరా, ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని, ఫిబ్రవరి 2013 నెలలో మొదటి వారంలో స్కైప్‌ ఉపయోగించి వైద్య సిబ్బందితో వీడియో కాన్షరెన్స్‌ ఉంటుందని, ఫిబ్రవరి 2, 2013లోపు వెబ్‌ కెమెరా, ఇంటర్‌నెట్‌ ఏర్పాటు చేసి వివరాల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని సంద్రించాలని ఆదేశించారు. మదర్‌ అండ్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టంలో ప్రాముఖ్యతను అర్థం చేసుకుని 2రోజులలో పెండింగ్‌ వివరాలను నమోదు చేయాలని ఆయన వైద్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఈ సెట్‌ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సి.రంగారెడ్డి, ఎన్‌.ఆర్‌.హెచ్‌ఎం. డిపిఓ డాక్టర్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.