మద్యం దుకాణాలపై నిఘా
– ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం సరఫరా చేయొద్దు
– ప్రతి షాపులో రోజువారీ స్టాక్ లెక్కలు ఉండాలి
– ఆబ్కారీ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్
హైదరాబాద్, అక్టోబర్13(జనంసాక్షి) : ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని ఆబ్కారీ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యంపై నియంత్రణకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, అబ్కారీ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా అబ్కారీ శాఖ చేపట్టాల్సిన చర్యలపై సూచించారు. సమావేశం తర్వాత సోమేశ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం సరఫరా చేయొద్దని చెప్పారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం పంపిణీ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2523 కి ఫోన్ చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ మద్యం షాపులో రోజువారీ స్టాక్ లెక్కలు ఉండాలన్నారు. హైదరాబాద్ లోని జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని జిల్లాల అబ్కారీ శాఖ ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు, సూపరింటెండెంట్లు హాజరయ్యారు.