మద్యపాన నిషేధంతో పెరిగిన చీరల కొనుగోళ్లు

డీఎంఐ సర్వేలో వెల్లడి

పాట్నా, జూన్‌18(జ‌నం సాక్షి) : బీహార్‌లో మద్యపానం నిషేధం తర్వాత ఖరీదైన చీరలు, మంచి ఆహారం, ఆరోగ్యంగా ఉంచే వస్తువులను అధిక మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నట్లు ఆసియా డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(ఏడీఆర్‌ఐ) మరియు డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌(డీఎంఐ) సర్వేలో తేలింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే రిపోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శాసనసభ ముందుంచారు. బీహార్‌లోని గ్రావిూణ ప్రజల విజ్ఞప్తుల మేరకు.. 2016, ఏప్రిల్‌ నెలలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మద్యపాన నిషేధం తర్వాత తొలి ఆరు నెలల్లోనే 1,751 శాతం మేర చీరలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. డ్రస్‌ మెటీరియల్స్‌ – 910 శాతం, ఆహార ఉత్పత్తులు – 46 శాతం, తేనే – 380 శాతం, వెన్న – 200 శాతం, బట్టర్‌ మిల్క్‌ – 40 శాతం, పాలు – 28. 4 శాతం, లస్సీ – 19.7 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు సర్వేలో తేలింది. ఇంట్లోకి ఉపయోగించే ఫర్నిచర్‌ 20 శాతం, ఆట వస్తువులు 18 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. 19శాతం మంది కొత్తగా ఆస్తులను కొన్నట్లు తెలిసింది. మద్యపానం నిషేధం తర్వాత మహిళలను గౌరవంగా చూస్తున్నారని సర్వే ద్వారా వెల్లడైంది. మహిళల మాటకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.