మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ ఒంటరి పోరు

పొత్తులు లేవన్న మాయావతి

భోపాల్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేస్తాయని వస్తున్న వార్తలను బీఎస్పీ ఖండించింది. దీంతో భాజపాను ఓడించేందుకు విపక్షాలు సమష్టిగా పోటీ చేయాలనే ప్రతిపాదనలకు చుక్కెదురైనట్లైంది. ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీఎస్పీ పొత్తుతో పోటీ చేస్తాయని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే పొత్తు విషయంపై కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయనే వార్తలను బీఎస్పీ ఖండించింది. ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదని, ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారమైతే బీఎస్పీ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతుందని సీనియర్‌ బీఎస్పీ నేత ఒకరు స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు విషయంపై సంప్రదింపులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెప్తున్నారని విూడియా నన్ను అడిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో అలాంటి సంప్రదింపులేవిూ జరగడం లేదని స్పష్టం చేశాను. కేంద్ర స్థాయిలో కూడా చర్చలు జరగట్లేవని భావిస్తున్నా. ఈరోజు వరకున్న పరిస్థితుల ప్రకారం బీఎస్పీ రాష్ట్రంలోని అన్ని 230 స్థానాల్లో పోటీ చేస్తుంది. పొత్తు విషయంపై కేంద్ర నాయకత్వం నుంచి నాకు ఎలాంటి సూచనలు అందలేదు’ అని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు నర్మదా ప్రసాద్‌ అహివార్‌ వెల్లడించారు. అయితే అటు కాంగ్రెస్‌ కూడా తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పలేదని అంటోంది. వచ్చే ఎన్నికల్లో భావ సారూప్యం ఉన్న పార్టీలతో పొత్తుకు ప్రయత్నిస్తామని మాత్రమే చెప్పాం, అంతేకాని ప్రత్యేకంగా బీఎస్పీ పేరు చెప్పలేదని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ విూడియా విభాగం చీఫ్‌ మానక్‌ అగర్వాల్‌ వెల్లడించారు. ఏడాది నవంబరు-డిసెంబరు సమయంలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 165స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్‌ 58, బీఎస్పీ 4, స్వతంత్రులు మూడు చోట్ల గెలుపొందారు. భాజపాకు 44.88శాత ఓట్లు పోలవగా.. కాంగ్రెస్‌కు 36.68శాతం, బీఎస్పీకి 6.29శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే 2008 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు 37.64శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 32.85శాతం, బీఎస్పీకి 8.97శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌, బీఎస్పీల ఓట్లు కలిపి భాజపాకు పోలైన ఓట్ల కంటే నాలుగు శాతం ఎక్కువ.