మనకు కాదు పండుగ

నూతన సంవత్సరం.. ఇంగ్లిష్‌ క్యాలెండర్‌ ప్రారంభమయ్యే రోజు. బ్రిటిష్‌ పాలనతో పాటు మనదేశంలోనూ ప్రవేశించిన పండుగ ఇది. శాస్త్రసాంకేతిక రంగాలు దినదినాభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచీకరణ ప్రభావంతో ఈ పండుగ నగరాలు, పట్టణాలు దాటి గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించింది. గడియారంలో 00.00 సమయం కాగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకుంటోంది. ఈ పేరుతో డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. కానీ తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు పండుగ వాతావరణం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 2009 డిసెంబర్‌ 9 నుంచి ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది విద్యార్థులు, యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఉజ్వల భవిత ఉన్న యువతను కోల్పోయిన ఆయా గ్రామాల్లో ఇప్పటికీ నిశ్శబ్దం ఆవరించే ఉంది. ఈ విషాదం నుంచి తేరుకోకముందే దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు కామాంధులు నడుస్తున్న బస్సులో ఓ విద్యార్థినిపై సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిపై రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. అత్యాచారం చేసి వదిలేయకుండా రాడ్లతో యువతిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఆమె మెదడుతో పాటు సున్నితావయావాలపై తీవ్ర గాయాలయ్యాయి.  పీకల్దాక మద్యం తాగిన ఆ కిరాతకులు యువతిని, ఆమె స్నేహితుడిని నడుస్తున్న బస్సులోంచి తోసేశారు. ఈ కీచకపర్వంలో ఒళ్లు చిద్రమైన ఆమెకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రి, సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. భవిష్యత్‌పై ఎన్నో కలలుగన్న ఆమె మృత్యువుతో 13 రోజులు పోరాడి ఓడిపోయింది. దేశం యావత్తూ దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె జ్ఞాపకాలు అందరి మదిలోనూ మెదులుతూనే ఉన్నాయి. ఆమె చితిమంటలు అందరి కళ్లల్లో కనిపిస్తున్నాయి. అమానత్‌ నీకు నివాళి అంటూ ఊరువాడ కదిలాయి. అన్నీ కళ్లు ఆమెకోసం వర్షించాయి. ఇంకెవరికీ ఇలాంటి స్థితి రావొద్దు అంటూ యావత్‌ దేశం కోరుకుంది. కానీ ఈ ఘటనకు పురిగొల్పిన మద్యాన్ని మాత్రం విస్మరిస్తోంది. సోమవారం సాయంత్రం మొదలు మంగళవారం తెల్లవారుజాము వరకు నూతన సంవత్సరానికి స్వాగతం తెలిపే వంకతో యువత అదే మద్యాన్ని ఆశ్రయిస్తోంది. ఈ వేడుక పేరుతో దేశాన్ని పాలిస్తున్న కార్పొరేట్‌ ప్రభుత్వం కోట్లాది మద్యం కేసుల్ని దేశ వ్యాప్తంగా సరఫరా చేసి తాగి ఊగమంది. వందల వేల కోట్ల రూపాయలు ఈ పేరుతో మూటగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. దౌర్భాగ్యం ఏమిటంటే ఈ తాగితూగేందుకు చేసుకుంటున్న వేడుకల్లో యువకులతో పాటు యువకులు పాలుపంచుకోవడం చూస్తుంటే మనం ఎటు పోతున్నామో అర్థం కాని పరిస్థితి. మద్యం మనిషిలోని విచక్షణ శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అలాంటి మద్యాన్ని పాలకులే అందుబాటులో ఉంచి రేపటి పౌరులను చెడగొట్టడం ఎంతవరకు సమంజసం. పౌరులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులు వారిని తాగుబోతులుగా మార్చి ఎన్నికల సమయంలో మద్యం బుడ్డీతో లోబర్చుకునే రాజకీయాలు ఇంకెంతకాలం కొనసాగిస్తారు. న్యాయమైన లక్ష్యం సాధించేందుకు తెలంగాణ బిడ్డలు, మద్యం మత్తులో కామాంధుల కీచకపర్వానికి అమాయకురాలు అమానత్‌ మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇక్కడ మనవాళ్లది బలవన్మరణం. అమానత్‌ది నూరుశాతం హత్య. వెయ్యి మంది మన యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఎవరు ఎలా స్పందించారో తెలియదు. కానీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు పెట్టుబడీదారులైన రాజకీయ నాయకులు దారుణంగా మాట్లాడారు. మరణాన్ని, అమరత్వాన్ని తక్కువ చేసి మాట్లాడారు. ఇలాంటి స్థితిలో మన బిడ్డలు మన మధ్య లేకుండా నూతన సంవత్సర పండుగ ఎలా జరుపుకుంటాం? అమానత్‌ చితి మంటలు ఆరకముందే ఎలా వేడుక చేసుకుంటాం? అందుకే పండుగ మనకు కాదు.. మనకోసం రాలేదు. పాశ్చాత్య పండుగను మనవారి కోసం విడిచిపెడుదాం. మన బిడ్డలను స్మరించకుంటూ.. అమానత్‌కు నివాళలర్పిస్తూ ‘నూతన’ వేడుకను వేడుకను బహిష్కరిద్దాం.