మనది ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం’’ : మమత
కోల్‌కతా: తొక్కిసలాట ఘటనల కారణంగా మహాకుంభ్ మృత్యుకుంభ్‌గా మారిందన్న తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం స్పందించారు. తాను అన్ని మతాలు, సంస్కృతులను గౌరవిస్తానని స్పష్టంచేశారు. మతం అనేది వ్యక్తిగతమని, మతపరమైన పండగలు అందరి కోసమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ‘‘నేను నా మతాన్ని గౌరవించనని ఎవరు చెప్పారు. గుర్తుంచుకోండి.. మతం అనేది వ్యక్తిగతమైనది. కానీ, పండగలు అందరివీ. మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతిరాష్ట్రానికి ప్రత్యేకమైన భాషలు, విద్య, జీవనవిధానం, సంస్కృతులు, నమ్మకాలు ఉన్నాయి. కానీ, మనం అన్ని సంస్కృతులను గౌరవించాలి. అందుకే మనది ‘భిన్నత్వంలో ఏకత్వం’ సిద్ధాంతం’’ అని మమత చెప్పారు. ‘‘మీరు పురుషుడా? స్త్రీనా అని కొన్ని సందర్భాల్లో ప్రజలు నన్ను అడుగుతుంటారు. నన్ను నేను ఓ మనిషిగా భావిస్తాను. మానవత్వమే నాకు ముఖ్యమని వారికి బదులిస్తాను’’ అని పేర్కొన్నారు.