మనీల్యాండరింగ్‌ కేసులో..  చిదంబరం, కార్తీలకు రిలీఫ్‌..!


న్యూఢిల్లీ, జులై10(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు ఢిల్లీ కోర్టులో మరోసారి ఊరట లభించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసు మనీ ల్యాండరింగ్‌ కేసులో వీరికి అరెస్టు నుంచి కల్పించిన రక్షణను వచ్చే నెల 7 వరకు పొడిగిస్తున్నట్టు పటియాలా హౌస్‌ కోర్టు ప్రకటించింది. సీబీఐ, ఈడీ సంస్థలు దాఖలు చేసిన రెండు కేసుల్లో ఢిల్లీ కోర్టు ఇంతకుముందు చిదంబరం, కార్తీలకు నేటివరకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో చిదంబరానికి ఆగస్టు 1 వరకు అరెస్టు నుంచి మినహాయింపు లభించిన మరుసటి రోజే ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులో చిదంబరం, కార్తీలు ఇప్పటికే రెండు సార్లు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం చిదంబరం మాట్లాడుతూ.. తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాననీ, అవన్నీ ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేయకుండానే విచారణ ప్రారంభించారని ఆయన విరుచుకుపడ్డారు. మే 30న ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.