మనుషులపై ఔషధ ప్రయోగాలా ? సుప్రీం సీరియస్
నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంసుప్రీం సీరియస్
నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంన్యూఢిల్లీ, అక్టోబర్ 8 (జనంసాక్షి):
మనుషులపై ఔషధ ప్రయోగాలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గినీ పందులపై ఔషధ ప్రయోగాలు చేసినట్లు ఔషధ కంపెనీలు మనుషులపై ప్రయోగాలు చేస్తున్నాయని మండిపడింది. ఔషధ ప్రయోగా లపై దాఖలైన ప్రజాప్రయోజనాన్ని విచారించిన న్యాయస్థానం.. దీనిపై నివేదిక సమర్పించాలని కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలను సోమవారం ఆదేశించింది. ఔషధ ప్రయోగాలు వికటించి ఇప్పటివరకు ఎంత మంది మరణించారు? ఎంత మంది అస్వస్తతకు గురయ్యారు? వారికి అందించిన నష్ట పరిహారం ఎంత? తదితర వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని జస్టిస్ ఆర్‌ఎం లోధా, ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఔషధ
కంపెనీలు మనుషులపై చేస్తున్న ప్రయోగాలపై స్వస్త్య అధికార్ మంచ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న ఔషధ సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను జనంపై ప్రయోగిస్తున్నాయని, గినీ పందుల్లాగా మనుషులపై ప్రయోగాలు చేస్తున్నాయని ఆరోపించింది. దీనిని తక్షణమే నివారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాన్ని సోమవారం విచారించింది. విచారణ సందర్భంగా కోర్టు ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘ఔషధ ప్రయోగాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీన్ని మేం తీవ్రంగా పరిణిస్తున్నాం. మనుషులపై ప్రయోగాలను తక్షణమే నిలిపివేయాలి. ఇందుకు స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేస్తున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఔషధ ప్రయోగాలపై వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నామని, ఆయా వివరాలు అందజేయాలని అదనపు సొలిసిటర్ సిద్ధార్థ్ లూత్రాను ఆదేశించింది. 2005 జనవరి 1 నుంచి 2012 జూన్ 30 వరకు ఔషధ ప్రయోగాల కోసం కేంద్రానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఔషధ ప్రయోగాల వల్ల ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారు? ఎంత మందికి వికటించింది? ఔషధ ప్రయోగాలు వికటిస్తే.. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? బాధితులకు నష్ట పరిహారం అందిందా? తదితర వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది