మన్మోహన్‌ సింగ్‌కు క్లీన్‌చిట్‌

5

– బొగ్గు మసి అంటలేదు

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 16 (జనంసాక్షి):

బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ప్రత్యేక సీబీఐ కోర్టు ఊరట కల్పించింది. ఈ కేసులో మాజీ ప్రధానికి సమన్లు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా నిందితుడని, ఆయనకు సమన్లు జారీ చేయాలని ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌కు కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణ రావు కూడా మద్దతిచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక సీబీఐ కోర్టు సె/-టపెంబర్‌ 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. కాగా, ఈ కేసులో మన్మోహన్‌ సింగ్‌ నిందితుడని చెప్పడానికి ఎలాంటి రుజువులు లేవని, బొగ్గు గనుల కేటాయింపుల్లో ఆయన ప్రమేయం లేదని రుజువవడంతో ఆయనకు సమన్లు జారీ చేయాల్సిన అవసరం లేదంటూ శుక్రవారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి భరత్‌ పరాశర్‌ తీర్పునిచ్చారు. బొగ్గు కుంభకోణలో మధు కోడా, దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌, బొగ్గుగనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా సహా మరో 11మందిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో బొగ్గు కుంభకోణం నుంచి మన్మోహన్‌ సింగ్‌ కు పూర్తి విముక్తి లభించినట్లే. సిబిఐ కోర్టు ఆయనపై అభియోగాలు మోపాలన్న పిటిషన్‌ ను కొట్టివేసింది. మన్మోహన్‌ సింగ్‌ పై ఆదారాలు లేవని సిబిఐ గతంలో చెప్పినా, కోర్టు సమన్‌ లు జారీ చేయాలని ఆదేశించింది. దానిపై సింగ్‌ సుప్రింకోర్టును ఆశ్రయించారు. సుప్రింకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి సిబిఐ కోర్టు ఈ కేసులో సిబిఐ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మన్మోహన్‌ సింగ్‌ పై కేసు కొట్టివేసింది. అయితే అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న దాసరి నారాయణరావు అంతా మన్మోహన్‌ సింగ్‌ పై కేసు నెట్టేస్తూ అఫిడవిట్‌ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు దానిని ఒప్పుకోలేదు.మరి దాసరి పై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంటుంది.