మమతా వ్యాఖ్యలపై కోర్టులో పిటీషన్‌

వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలకు నోటీసు
కోల్‌కతా, ఆగస్టు 16 : న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయి. కలకత్తా హైకోర్టు ఆమె వ్యాఖ్యలను పరిశీలించి కేసు నమోదు చేసే అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తుంది. జస్టిస్‌ సేన్‌ గుప్తా, ఎ.కె.మండల్‌ మమత వ్యాఖ్యలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా కలకత్తాలోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం ఆచార్యుడు అంభికేష్‌ మహోపాత్ర ఆయన పొరుగున ఉన్న సుప్రతా సేన్‌ గుప్తాలను పోలీసులు వేధించినట్టు పశ్చిమబెంగాల్‌ మానవహక్కుల సంఘం పేర్కొన్న నేపథ్యంలో మమత వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ‘కొన్ని సార్లు కోర్టు తీర్పును కూడా కొనుగోలు చేస్తున్నారంటూ, దీదీ చేసిన విమర్శలు పలు వివాదాలకు దారి తీసింది. పెనుదుమారాన్ని లేపింది. ప్రతిపక్షాలు న్యాయవాదులు ఆమె వాదనపై మండిపడ్డాయి. కోర్టు తీర్పులను డబ్బులిచ్చి కొంటున్న ఉదాహరణలున్నాయి. న్యాయవ్యవస్థలో ఒక వర్గం అవినీతికి పాల్పడుతుంది. ఇలా అన్నందుకు నాపై పరువు నష్టం కేసు వేయవచ్చు. నేను జైలుకు వెళ్ళేందుకు సిద్ధమే అంటూ మమత మంగళవారం న్యాయవ్యవస్థపై అసెంబ్లీలో గళమెత్తిన విషయం తెలిసిందే. ఆమె ఆరోపణలు అత్యంత బాధ్యతారాహిత్యమని సుప్రీంకోర్టు బార్డ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రవీన్‌ పరేక్‌ మండిపడ్డారు. మమత ఇప్పటివరకు కొన్ని కేసులు గెల్చారు. అందుకోసం ఆమె డబ్బులిచ్చి తీర్పులను కొన్నారా అంటూ ప్రముఖ న్యాయవాది సోలీ సొరాబ్జీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న మమత ఒక రాజ్యాంగ సంస్థపై ఇలాంటి పస లేని ఆరోపనణలు చేయడం తగదని, బిజెపి నేత బల్భీర్‌ పుంజ్‌ హితవు పలికారు. ఒకప్పటి అన్నహజారే టీం సభ్యుడు సంతోష్‌ హెగ్డే ప్రముఖ న్యాయవాదులు రాంజఠ్మలాని, పిపి రావు తదితరులు కూడా మమత వ్యాఖ్యలను ఖండించారు. మమత అసంతృప్తితో, అసహనంతో కోర్టులను విమర్శించారని సిపిఎం నేత మహ్మద్‌ సలీం వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా బెంగాల్‌ దీదీ తన వ్యాఖ్యాలకు కట్టుబడి ఉంటుందో లేక వివరణ ఇస్తుందో వేచి చూడాలి.