మమ్మల్నందరినీ ఒకేసారి అరెస్టు చేయండి

2

– ఆప్‌ సభ్యుల నిరసన

ఢిల్లీ,జూన్‌ 26(జనంసాక్షి):ఢిల్లీలో 52 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాని నివాసానికి ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు తుగ్లక్‌ రోడ్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఐతే, తమ మెసేజ్‌ ను ప్రధానికి చేరవేయాలని ఈ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా పోలీసులను కోరారు. మోడీ సర్కార్‌ కావాలనే తమ ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతోందని, తమపై కోపం ఉంటే అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేయండని ఆయన ప్రధాని మోడీని కోరారు. ఢిల్లీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దన్నారు. కొన్ని రోజులుగా ఆప్‌ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ఆప్‌ ఎమ్మెల్యేలు ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఐతే, మార్గం మధ్యలోనే వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి, పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు.