మరోసారి కులగణన

` సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం
` 16నుంచి 28 వరకు మళ్లీ నిర్వహిస్తాం
` ఎన్యూమరేటర్లకు వివరాలు అందజేయాలి
` రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవడం అందరి బాధ్యత
` 42శాతం బిసి రిజర్వేషన్‌ కోసం కేబినేట్‌ తీర్మానం
` చట్టబద్దత కోసం కులగణన బిల్లు కేంద్రానికి పంపుతాం
` తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగింది
` మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వివిధ కారణాల వల్ల కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 16 నుంచి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలని సూచించారు. రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవాలని కోరారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్‌ తీర్మానం చేయనుంది. శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయించాం. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తాం. ఓబీసీల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నాయకులను కలుస్తాం. దశాబ్దాల ఓబీసీల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తాం. రిజర్వేషన్లపై రాజకీయపరంగా కుట్రలు చేస్తే తిప్పి కొడతాం. రాజకీయ లబ్ది పక్కన పెట్టి మద్దతు పలకాలని కోరుతున్నాం‘ అని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పై అసెంబ్లీలో లెక్కలతో సహా సీఎం సభ దృష్టికి తెచ్చారని, అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సలహాలు సూచనలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని ఆయన పేర్కొన్నారు. 3.1శాతం మంది మాత్రమే ఇంటి యజమానులు సర్వేలో పాల్గొనలేదన్నారు. కొద్దిమంది ఇంటికి తాళాలు వేసి వెళ్లారని ఆయన తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సర్వేకు రాలేదని, సర్వేలో పాల్గొని వారి కోసం మరోసారి కుటుంబ సర్వేకు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. టోల్‌ ఫ్రీ ద్వారా కూడా సమాచారాన్ని ఇస్తే ఎన్యుమరేటర్లు వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి విక్రమార్క తెలిపారు. మండల కేంద్రాల్లో రాష్ట్ర జనాభా లెక్కల్లోకి రావాలని అందర్ని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా.. ’లెక్కలోకి వచ్చి జన జీవన స్రవంతిలో కలవాలని కేసీఆర్‌ లాంటి వాళ్ళను కోరుతున్నాను. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు వివరాల నమోదు పూర్తి చేసి? లెక్కలన్నీ క్యాబినెట్‌ లో పెట్టి బీసీలకీ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. మార్చి మొదటి వారంలో క్యాబినెట్‌ లో పెట్టి తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్‌ చేస్తాం. .ఈ బిల్లును కేంద్రానికి పంపి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం. పార్లమెంటు లో కూడా ఈ బిల్‌ పెట్టి ఆమోదించేలా రాహుల్‌ గాంధీని, ప్రధానిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి వారి మద్దతు కూడా గడతాం. దశాబ్దాల బిసిల కల నెరవేర్చుతాం. కలసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను తీసుకుని ఢల్లీి వెళతాం. స్థానిక సంస్థల్లో 42 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేస్తాం. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మేం చేసే కార్యక్రమానికి మద్దతు పలకాలని కోరుతున్నాం. ప్రగతిశీల భావజాలలు ఉన్న అందరు కలిసి రావాలి.’ అని భట్టి విక్రమార్క అన్నారు.