మరో ఆఫ్ బాటిల్ మద్యం తేలేదని కత్తెరతో పొడిచి చంపాడు

8x52mbgcహైదరాబాద్: మనిషి తాగితే ఎంతటి దారుణానికైనా ఒడిగడతనడానికి ఇది నిదర్శనం. మరో ఆఫ్ బాటిల్ మద్యం తేలదని తన తోటి మిత్రుడితో గొడవపడి కత్తెరతో పొడి చంపేసిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం కాలనీలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరి భర్తలు గతంలోనే చనిపోయారు. అయితే అక్కాచెల్లెళ్లో ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి సంజ్యానాయక్‌తో సహజీవనం చేస్తోండగా, మరొకరు తలారి ప్రవీణ్‌కుమార్(29) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రవీణ్‌కుమార్‌ది నిజామాబాద్ జిల్లా నవీపేట కాగా ప్రస్తుతం మల్లారెడ్డి వైద్యశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సంజ్యానాయక్ స్థానికంగా ఉన్న మార్బుల్ షాపులో బండలు మోసే కూలీగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్‌కుమార్, సంజ్యానాయక్ అప్పుడప్పుడు కలిసి మద్యం కొడుతుంటారు.  ఈ క్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుని ప్రవీణ్‌కుమార్, సంజ్యానాయక్, సదరు మహిళలు బుధవారం మధ్యాహ్నం విందు పార్టీ చేసుకున్నారు. ఇందుకోసం ఫుల్ బాటిల్ చీఫ్ లిక్కర్, చికెన్‌ భోజనాన్ని వండుకున్నారు. అనంతరం నలుగురు కూర్చుని మద్యం తాగారు. అయితే తాగిన మద్యం సరిపోలేదని మరో రూ.150 పెట్టి ఆఫ్ బాటిల్ తెమ్మంటూ ప్రవీణ్‌కుమార్ సంజ్యానాయక్‌ను ఆదేశించాడు. ఇందుకు సంజ్యానాయక్ ససేమిరా అనడంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. దీంతో ప్రవీణ్‌కుమార్, సదరు మహిళ, సంజ్యానాయక్‌పై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన సంజ్యానాయక్ ఆవేశంతో ఊగిపోతూ కత్తెరతో ప్రవీణ్ కుమార్ గుండెల్లో పొడిచాడు. దీంతో ప్రవీణ్‌కుమార్ నేలపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సంజ్యానాయక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.