మల్కాజిగిరి సీటు కోసం వేణు ప్రయత్నాలు

ముథోల్‌ ఓటమితో ఆదిలాబాద్‌లో ఉనికి కోల్పోయిన చారి
కెసిఆర్‌ నిర్ణయంపైనే సీటు కేటాయింపు
పోటీలో మైనంపల్లి, మల్లారెడ్డి
హైదరాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌లో కీలక నేతగా,ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతనిధిగా ఉన్న సముద్రాల వేణుగోపాలచారి మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక్కడ ఇంకా టిక్కెట్‌ ప్రకటించలేదు. దసరా తరవాత మిగిలిన వాటితో పాటు మల్కాజిగిరి టిక్కెట్‌ ప్రకటన ఉంటుందంటున్నారు. అయితే ఇక్కడ టిక్కెట్‌ కోసం పోటీ కూడా తీవ్రంగా ఉంది. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎంపి మల్లారెడ్డిలు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు. నిజానికి వీరిని కదాని వేణుగోపాలచారికి ఇవ్వగలరా అన్నది అనుమానమే. ఆర్థికంగా బలంగా ఉన్న ఈ ఇద్దరు నేతల ముందు చారి సరిపోరు. అయితే ఇక్కడ బ్రాహ్మణ ఓట్లు గణనీయంగా ఉండడంతో పాటు, కొంతకాలంగా ఆయన ఈ సీటును కోరుతూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇకపోతే గత ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లా ముథోల్‌ నుంచి ఓటమి చెందడంతో ఇప్పుడాయనకు జిల్లాలో సీటు లేకుండా పోయింది. ముథోల్‌ నుంచి గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో చారికి సీటు లేకుండా పోయింది. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాగా వేశారు. ఈ పరిస్థితుల్లో చారి మల్కాజిగిరి కోసం పట్టుబడుతున్నారు. నిజానికి గతంలోనే ఆయనకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎంపి ఇస్తానని కెసిఆర్‌ హావిూ ఇచ్చారని సమాచారం. కానీ అలా జరగలేదు.  అలా జరిగివుంటే ఇప్పుడీ కష్టాలు ఉండేవి కావు. తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా, చంద్రబాబుకు సమకాలికుడిగా… నమ్మకమైన వ్యక్తిగా కేంద్రంలో, రాష్ట్రంలో ఆయన చక్రం తిప్పారు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయనే సుప్రీంగా ఉన్నారు.  టికెట్ల కేటాయింపులు, పదవుల పంపకాల్లో ఆయన చెప్పిందే నడిచింది. అందుకే  ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఎందరో నాయకులకు రాజకీయ గురువుగా మారారు. అలాంటి నేత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కోసంవెంపర్లాడాల్సి వస్తోంది.  1985లో నిర్మల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసింది మొదలు టీడీపీ నుంచి బయటకు వచ్చిన 2012 వరకు రాజకీయంగా ఎదురులేని నాయకుడిగా చలామణి అయిన ఆయన ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టిడిపి అధినేత ఎన్టీఆర్‌ను నాదెండ్ల వెన్నుపోటు పొడిచాక 1985 మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా తొలి విజయం  అందుకున్న చారి.. ఎన్టీరామారావు సైతం ఓటమి పాలైన 1989లో కూడా నిర్మల్‌ నుంచి విజయం సాధించారు. అప్పటి నుంచే పార్టీలో పట్టు సాధించిన ఆయన చంద్రబాబు వర్గంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తనతో పాటే 1985లో సిద్దిపేట నుంచి గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. ఆనాటి నుంచి చారి తెలుగుదేశం పార్టీని వీడేంత వరకు పార్టీలో కీలకమైన నాయకుడిగా వ్యవహరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతల్లో ఎక్కువ శాతం మంది వేణుగోపాలచారి రాజకీయ నీడలో ఎదిగినవారే.   2014లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముథోల్‌ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలవడం ఇప్పుడు ఆయన రాజకయీంగా చక్రం తిప్పే అవకాశం లేకుండ ఆపోయింది. ఇకపోతే టిఆర్‌ఎస్‌లో నామ్‌కే వస్తే నేతగా ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ప్రభంజనం
ఉంటే కాంగ్రెస్‌ సాధించిన ఏకైక సీటు విఠల్‌రెడ్డిదే కావడం చారిని రాజకీయంగా దెబ్బతీసింది. కేసీఆర్‌ పాత మిత్రుడైన చారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్‌ ¬దా కట్టబెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఏకచ్ఛత్రాధిపత్యంగా రాజకీయాలు నడిపించిన వేణుగోపాలాచారి 2014లో ఓటమి తరువాత ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితం కావలసిన పరిస్థితి ఎదురైంది. ముథోల్‌లో తనపై గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి ఇప్పుడు మరోసారి టికెట్టు తెచ్చుకోవడాన్ని చారితో పాటు ఆయన వర్గీయులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటనేది తెలియక ఆందోళన చెందుతున్నారు.  1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. 1996 పార్లమెంటు ఎన్నికల్లో మంత్రిగా ఉంటూనే ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన చారి దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌ మంత్రివర్గంలో సంప్రదాయేతర ఇంధనవనరుల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో మరోసారి కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. 1999లో మూడోసారి ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచి 2004 వరకు కొనసాగారు. ఆదిలాబాద్‌ ఎంపీ సీటు ఎస్టీ రిజర్వ్‌డు కావడంతలో ఆయనకు జిల్లాలో ఎంపిగా పోటీ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. 2009లో కొత్తగా ఏర్పాటైన ముథోల్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ముథోల్‌ నుంచి మరోసారి విజయం సాధించిన ఆయన టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నిల్లో ఓటమిపాలు కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం మల్కాజిగిరి కోసం పట్టుబడుతున్నారు. ఈ సీటును కెసిఆర్‌ ఎవరికి కేటాయిస్తారన్నది చూడాలి.

తాజావార్తలు