మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని, అంబేద్కర్‌ ఫోటోను కాళ్లతో తన్ని అవమానించారని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు దళిత నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో మల్కాజ్‌గిరి ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు అరుణ్‌ హల్ధర్‌ బాధితురాలని విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనలో గాయపడిన బాధితుల్ని పరామర్శించామని తెలిపారు. దళితులను తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది అధికారులు నిందితులను రక్షించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ఘటనపై కమిషన్‌ తీవ్రంగా దృష్టి సారించిందని తెలిపారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన అంశమని, నిందితులు ఎంతటివారైనా సరే 24 గంటల్లో అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. నిందితులను అరెస్ట్‌ చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అరుణ్‌ హల్ధర్‌ పేర్కొన్నారు.