మల్లన్నసాగర్ కట్టితీరుతాం
– రైతులను ఒప్పిస్తాం
– హరీశ్
హైదరాబాద్,జులై 26(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మల్లన్నసాగర్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను అడ్డుకోవడమే ప్రతిపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ విషయంలో విపక్షాలు ఇక్కడో నీతి, ఎపిలో మరో నీతిని ప్రదర్విస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను ఒప్పించి, మెప్పించి కచ్ఛితంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కడతామని మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి విపక్షాలు నానా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. మొదటి నుంచి ప్రజలు ఒకవైపుంటే..ప్రతి పక్షాలు ఇంకోవైపు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు కోడిగుడ్డు విూద ఈకలు పీకేలా వ్యవహరిస్తున్నయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయమంటే జిరాక్స్ కాపీలు పంపి మోసం చేసిన ఘనత వీరిదని ధ్వజమెత్తారు. టిడిపి,కాంగ్రెస్ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో టిడిపి ప్రభుత్వాన్ని ఒక్క మాట అనని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. రైతులను రెచ్చగొట్టి ప్రాజెక్టులకు భూములు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుల వల్లే అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ రైతులను ఒప్పించి భూములను సేకరిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. వారు కోరుకున్న పరిహారాన్ని ఇచ్చి నిర్వాసితులను తెరాస, కేసీఆర్ అభిమానులుగా మారేలా చేస్తామన్నారు. రాజధాని కోసం ఏడాదికి రెండు పంటలు పండే భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేకపోయిందని హరీశ్‌రావు అన్నారు. రాజధాని కోసం 54వేల ఎకరాలు సేకరించడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఏపీ రాజధాని కోసం అన్ని ఎకరాలు అవసరమా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏపీ రాజధాని కోసం పచ్చని భూములు తీసుకున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వబోమని ఏపీలో రైతులు ఏడుస్తున్నారని, తాము ప్రాజెక్టుల కోసం భూములు తీసుకోవడం తప్పా అని టీడీపీ నేతలను ఉద్డేశించి హరీశ్ ప్రశ్నించారు. బీడు భూములను పచ్చగా చేసేందుకు తాము భూములను తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో వాన్‌పిక్ కోసం 16వేల ఎకరాలు సేకరిస్తే టిడిపి రాద్ధాంతం చేసిందని.. తాము అధికారంలోకి వస్తే భూములు తిరిగి ఇస్తామని హావిూ ఇచ్చిందంటూ ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చినా భూములు ఎందుకు తిరిగివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.పులిచింతల ప్రాజెక్టు వల్ల ఆంధ్రాలో నీరు పారితే.. తెలంగాణలోని గ్రామాలు నీట మునిగాయని హరీశ్‌రావు తెలిపారు. ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు దగ్గరుండి కట్టించారని అన్నారు. రైతులు కోరుకున్నట్లు పరిహారం ఇస్తమని సీఎం కేసీఆర్ చెప్పినా రాద్దాంతం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల అసలు రంగు తెలిసింది కాబట్టే..రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నరు. విూ మాయ మాటలు తొలిగిపోయి..రైతులు భూములను అప్పగిస్తున్నరు. విూ హయాంలో అక్రమ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, పులిచింతలను ఆపలేకపోయారు. ఆంధ్రా ప్రాజెక్టులను పూర్తి చేసి, తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోకుంటే ఆనాడు ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. విూరు చేసిన పాపాల వల్లనే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రం పచ్చగా ఉండాలని సీఎం కేసీఆర్ రాత్రింబవళ్లు శ్రమించి..ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి కోటి ఎకరాలకు నీళ్లివ్వాలని సంకల్పించారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం అధికారంలో ఉన్న చోట ఒక మాట..అధికారంలో లేని చోట మరో మాట మాట్లాడుతున్నయని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రాజెక్టులను కర్ణాటకలో కడుతుంటే కాంగ్రెస్ నేతలు ఏం చెప్తరని ప్రశ్నించారు. ఢిల్లీలోనేమో 2013 భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ..గల్లీలోనేమో 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలంటున్నరని మండిపడ్డారు. ఆంధ్రా రాజధాని కోసం 500 ఎకరాలు సరిపోతాయి.. కానీ ఏపీ సర్కార్ 54వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుందన్నారు. రెండు పంటలు పండే భూములను బడా బాబుల కోసం ఏపీ సర్కారు లాక్కుంటుందని విమర్శించారు.