మల్లన్నసాగర్‌ ముంపు రైతు ఆత్మహత్య

4
7
హైదరాబాద్‌,జులై 21(జనంసాక్షి): మల్లన్న సాగర్‌ ముంపు గ్రామమైన పల్లెపహాడ్‌లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మల్లన్న సాగర్‌ ముంపు వల్ల వ్యవసాయ భూమితో పాటు ఇళ్లు కూడా కోల్పోతున్నాననె బెంగతో గ్రామానికి చెందిన బచ్చల్లి నర్సయ్య బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. ప్రభుత్వం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీసుకుంటుందని ముంపు గ్రామాల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం పల్లెపహాడ్‌లో జరిగే నర్సయ్య అంత్యక్రియల్లో ముంపు బాధితులంతా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని నిర్ణయించుకున్నారు.

బాధిత రైతు కుటుంబానికి ప్రొఫెసర్‌ సూరెపల్లి సుజాత పరామర్శ

మల్లన్నసాగర్‌ ముంపు బాధితుడై ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాన్ని  ప్రొఫెసర్‌ సూరెపల్లి సుజాత పరామర్శించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆమె ఆరోపించారు.

ఈ రకంగా భూ సేకరణ చేయడం అన్యాయని, దీని వల్ల రైతులు తీవ్రమనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆమె అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం బలవంతపు భూసేకరణ మానుకొని  మల్లన్నసాగర్‌ విషయంలో నిపుణుల సలహాతీసుకోవాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం యువకుడు తీవ్రమనోవేదనకు గురై గుండాగి చనిపోగా, ఇప్పుడు రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిపుణుల సలహాలు తీసుకుని మల్లన్నసాగర్‌ అవసరమో,లేదో నిర్ణయించి, రైతుల ఆత్మహత్యలకు నిరోధించాలని ఆమెపిలుపునిచ్చారు.పరామర్శించిన వారిలో మార్వాడి సుదర్శన్‌, గుర్రాల రవీందర్‌, సీహెచ్‌ రవీందర్‌, సామాజిక కార్యకర్త రాజు తదితరులు పాల్గొన్నారు.