మల్లన్న సాగర్‌ మనకో వరం

ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే విజయం: ఎమ్మెల్యే
సిద్దిపేట,మే4(జ‌నంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతుల త్యాగం మరిచిపోలేనిదని
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. గ్రామాలలో కొనసాగుతున్న మల్లన్నసాగర్‌ కాల్వ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ కాల్వ నిర్మాణంతో నియోజకవర్గంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందన్నారు. కాళేశ్వరంలో భాగగంఆ ఈ ప్రాజెక్టు రావడంతో ఇక్కడ పంటలకు ఇక ఢోకా ఉండదని అన్నారు. సీఎం కేసీఆర్‌, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం యుద్ధప్రాతిపదికన కొనసాగుతుందన్నారు. వ్యవసాయానికి సాగునీరందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. దుబ్బాక పట్టణంలో వెయ్యి డబుల్‌బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇండ్ల కేటాయింపుల్లో అధికారులతో కలిసి పారదర్శకంగా పనిచేస్తామని కేటాయించిన వారి పేర్లను పది రోజుల ముందే బహిర్గతం చేస్తామన్నారు. తాము ఎంపిక చేసిన లబ్ధిదారులపై ఫిర్యాదులుంటే జాబితాలోమార్పు చేర్పులు చేస్తామన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని అన్నారు.ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. కారు గుర్తు కు ఓటేసి గెలిపించాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీలతోపాటు అన్ని ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు ప్రలోభాలకు తలొగ్గకుండా కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  ఎన్నికల హావిూ ప్రకారం ఇంటింటికీ తాగునీళ్లు అందించామని, అధికారంలోకి రాగానే పంట పొలాలకు సాగునీరు అందిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌తోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. అన్నివర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని అన్నారు.