మల్లన్న సాగర్ ముంపు బాధితులకు స్వల్ప ఊరట
మెదక్:మల్లన్న సాగర్ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు..
2,15,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం……
మెదక్ జిల్లా తోగుట మండలంలో మల్లన్న ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల 15వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది…. ప్రాజెక్టుకు భూసేకరణకోసం సర్కారు 123, 214 జీవోలను విడుదల చేసింది.. అయితే ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలు ముంపుకు గురికానున్నాయి… దీంతో ఈ గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.. భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు..
14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన….
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 14 నెలలుగా ముంపు గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.. సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.. వీరి పోరాటం ఉధృతం కావడంతో స్వయంగా కలెక్టరే దిగివచ్చారు.. ముంపు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు.. స్థానికులంతా తమ సమస్యల్ని కలెక్టర్‌కు చెప్పుకున్నారు.. సర్వే నిలిపివేయాలని కోరారు..
వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు…
గ్రామస్తుల విజ్ఞప్తితో వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు న్యాయం జరగదని వారికి నచ్చజెప్పారు..
కలెక్టర్ వ్యాఖ్యలను తప్పుపట్టిన లాయర్ల యూనియన్….
కలెక్టర్ వ్యాఖ్యలను ఆలిండియా లాయర్ల యూనియన్ తప్పుబట్టింది…. ప్రజలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది.. ముంపు గ్రామాల్లో ఈ యూనియన్ సభ్యుల బృందం పర్యటించింది.. ప్రభుత్వ జీవోలతోనే ముంపు ప్రజలకు మేలు జరుగుతుందంటూ కలెక్టర్ చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. ముంపు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ప్రజలకు ఏం చేశారని బృందం ప్రశ్నించింది.. ఇలా అధికారులే రైతుల్ని మోసం చేయడానికి ప్రయత్నించడం మంచిదికాదని అభిప్రాయపడింది. సర్వే నిలిపివేత ఎలా ఉన్నా… తమ డిమాండ్లు నెరవేరేవరకూ పోరాడతామని నిర్వాసితులు చెబుతున్నారు.. అప్పటివరకూ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు..