మళ్లీ ఇందౌరే..

` పరిశుభ్రతలో మరోసారి సత్తాచాటిన నగరం
` వరుసగా ఎనిమిదోసారి ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’ అవార్డు కైవసం
` ‘వ్యర్థాల రహిత నగరం’ కేటగిరీలో హైదరాబాద్‌కు 7 స్టార్‌ రేటింగ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరం పరిశుభ్రతలో మరోసారి సత్తా చాటింది. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తొలిస్థానం దక్కించుకొంది.2024-25 సంవత్సరానికి గానూ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు ల్లో వరుసగా ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది ఇందౌర్‌తో పాటు సూరత్‌ కూడా సంయుక్తంగా తొలి ర్యాంక్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. మూడో స్థానంలో నవీ ముంబయి నిలిచింది. ఇక, ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి విజయవాడ సత్తా చాటింది. ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.3-10 లక్షల జనాభా జాబితాలో నోయిడా నగరం తొలి స్థానంలో ఉంది. చండీగఢ్‌, మైసూర్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గృహ, పట్టణ వ్యహరాల మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఈ మిషన్‌ కింద 4,500 నగరాలను పరిశీలిస్తారు. పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సేవల అందుబాటు వంటి పలు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు.స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఐదు అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌లోని 5 నగరాలు ఎంపికయ్యాయి. గ్రేటర్‌ వైజాగ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి సూపర్‌ స్వచ్ఛ లీగ్‌ అవార్డుల్లో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో విజయవాడ, 3-10 లక్షల్లోపు కేటగిరీలో గుంటూరు, 50వేల నుంచి లక్ష లోపు జనాభా కేటగిరీలో తిరుపతి నగరపాలక సంస్థలు అవార్డులకు ఎంపికయ్యాయి. కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి మంత్రి నారాయణ.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌, ఏపీ స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభితో పాటు ఆయా కార్పొరేషన్ల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నంబర్‌ వన్‌..
క్లీనెస్ట్‌ కంటోన్మెంట్‌ బోర్డ్‌ కింద ఇచ్చిన అవార్డుల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ తొలిస్థానాన్ని సొంతం చేసుకుంది. ‘వ్యర్థాల రహిత నగరం’ కేటగిరీలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ 7 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. గతంలో 5 స్టార్‌ రేటింగ్‌ ఉండేది. ప్రామిసింగ్‌ స్వచ్ఛ షహర్‌ నగరాల జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్‌ చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రామిసింగ్‌ స్వచ్ఛ షహర్‌గా రాజమండ్రి నిలిచింది.