మళ్లీ మొదలయిన పత్తి లొల్లి

రైతుల ఆందోళనకు విపక్షాల మద్దతు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మళ్లీ పత్తి లొల్లి మొదలయ్యింది. పత్తి రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. పత్తి అధికంగా పండే ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనుకున్నట్లుగా మళ్లీ రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమపేరుతో కొంత, మద్దతు ధరల పేరుతో మరికొంత దోచేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో తొలిసారిగా ఈ సీజన్‌లో రైతులు బుదవారం ఆందోళనకు దిగడం వారికి కాంగ్రెస్‌ తదితర పార్టీలు అండగా నిలవడంతో సమస్య మళ్లీ తీవ్రం అయ్యింది. వేలంపాట నిర్వహించిన అనంతరం తేమను 12 శాతం వరకు సడలించి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు పట్టుబట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. జిల్లా సంయుక్త పాలనాధికారి కృష్ణారెడ్డి రంగంలోకి దిగి వ్యాపారులతో చర్చలు జరిపినా

ఫలితం లేకుండాపోయింది. రెండు గంటలకు పైగా అలాగే ఆందోళన చేశారు. సంయుక్త పాలనాధికారి మార్కెట్‌కు చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 2గంటల పాటు మార్కెటింగ్‌ అధికారులతో జేసీ చర్చలు జరిపారు. అయితే ఈ వ్యవహారాన్ని మతం/-రి జోగురామన్న తేలికగా కొట్టి పారేశారు.

జిల్లాలో ప్రతిపక్షాల నాయకులు తమ ఉనికి కాపాడుకునేందుకు రైతులను మభ్య పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఈ నెల 27న చేపట్టే చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అధిష్ఠానం మెప్పు పొందేందుకు జిల్లా కాంగ్రెస్‌ నాయకులు పత్తి రైతులకు విషయంలో మార్కెట్‌ యార్డు ముందు ఆందోళన చేపట్టినట్లు మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో మొదటగా పత్తి కొనుగోళ్లను ప్రారంభించామని 12 రోజులుగా పత్తి కొనుగోళ్లు సాఫీగా జరుతున్నాయని మంగళవారం వరకు 2 లక్షల 17 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ మార్కెట్‌ యార్డులో లేని విధంగా జిల్లాలో పత్తి రైతులకు సరైన ధర చెల్లిస్తున్నారని రైతులకు క్వింటాకు రూ.4,550 ధర చెల్లించారని అన్నారు. రైతులకు సరైన ధర లభిస్తున్నా కూడా కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ధర్నాకు దిగడం విడ్డూరమన్నారు. ప్రతిపక్షాల అనాలోచిత నిర్ణయాలతో రైతుల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 5 లక్షల హెక్టార్లలో పంట విస్తీర్ణం పెరిగిందని.. పత్తి రైతులకు మద్దతు ధర విషయంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రుల బృందం కేంద్ర మంత్రులను కలిసినట్లు చెప్పారు.

45 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏ నాడు రైతుల గురించి ఆలోచించలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓర్వలేక తమ ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్షాల నాయకులు హాజరుకాకపోవడమే కాకుండా పత్తి కొనుగోళ్లు ప్రారంభం రోజు కనీసం మార్కెట్‌కు రాని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఇప్పుడు రైతులు గుర్తుకువచ్చారా అని ప్రశ్నించారు.

తాజావార్తలు