మళ్లీ వాయిదా వేయడం బాగోదు

 

 నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌

న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : రంజాన్‌ సందర్భంగా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని వాయిదా వేయాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ స్పందించారు. ఇప్పటికే ఒకసారి సమావేశాన్ని వాయిదా వేశామని, మళ్లీ వాయిదా వేయడం బాగోదని అన్నారు. రంజాన్‌ దృష్ట్యా నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఈనెల 17వతేదీకి గానీ, 18కి గానీ వాయిదా వేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.ఒకవేళ 18కి వాయిదా వేయలేని పక్షంలో కనీసం 17వ తేదీ మధ్యాహ్నానికైనా సమావేశాన్ని వాయిదావేయాలని చందబాబు లేఖలో కోరారు. నీతి ఆయోగ్‌ 4వ సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చంద్రబాబు ఆ లేఖలో వెల్లడించారు. అయితే 16న రంజాన్‌ పండుగ, 17 ఉదయం ఈద్‌ మిలాప్‌ కార్యక్రమాలున్నాయని, అందువల్ల తాను అమరావతిలో ఉండటం ఎంతైనా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ చంద్రబాబు విన్నపాన్ని రాజీవ్‌ కుమార్‌ సున్నితంగా తిరస్కరించారు.