‘మహానటి’ని అద్భుతంగా తీర్చిదిద్దారు

సీఎం చంద్రబాబు నాయుడు
– ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ‘మహానటి’ టీం
– చిత్ర సభ్యులను సన్మానించిన చంద్రబాబు
– అమరావతి నిర్మాణానికి నిర్మాతలు రూ.50లక్షల విరాళం
అమరావతి, మే26(జ‌నం సాక్షి) : మహానటి సావిత్రి నిజజీవితాన్ని తెరకెక్కించి ప్రజలకు మంచి సందేశాన్ని అందించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘మహానటి’ సినిమా యూనిట్‌ శనివారం చంద్రబాబు కలిసింది. సినిమా విజయవంతం కావడంతో చిత్ర యూనిట్‌ను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వైజయంతి సంస్థ తరఫున రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మహానటి’ సినిమాను చాలా చక్కగా తీసినందున నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్‌లను చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. రెండు సంవత్సరాలు ‘మహానటి’ జీవితాన్ని అధ్యయనం చేసి, మంచి సినిమాను తీసినందుకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను మెచ్చుకున్నారు. నటనలో హీరోల్లో ఎన్టీఆర్‌ ఎంత బాగా నటించేవారో.. హీరోయిన్లలో సావిత్రి అంతే బాగా నటించేవారన్నారు. చిత్ర బృందం ఎంతో సాహసంతో ఈ సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకుందని చంద్రబాబు అన్నారు. సావిత్రిది కూడా రాజధాని అమరావతిలోని గ్రామమే కావటం విశేషమని పేర్కొన్నారు. సినిమాకు పన్ను మినహాయింపుపై ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామని సీఎం అన్నారు. సావిత్రి ఈ సందర్భంగా కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతం అయినందున చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా సావిత్ర పాత్ర పోషించడం గొప్పతనమని, ఈ పాత్రతో తనకు మంచి గుర్తింపు ఇచ్చిన చిత్ర యూనిట్‌కు, అభిమానులకు కీర్తి సురేష్‌ అభినందనలు తెలిపారు. అనంతరం మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును అనాలా? బావగారు అనాలా తెలియడం లేదని అన్నారు. ఎందుకంటే ఆ కుటుంబంతో అంత అనుబంధం ఉందని, నారా భువనేశ్వరిని అక్కా అని పిలిచేదాన్నని తెలిపారు. అమ్మ సావిత్రి పుట్టిన ఊరిలో ఈ కార్యక్రమం జరపడం చాలాసంతోంగా ఉందని

, అమ్మ పేరుపై సినిమా తీసి, ఘనంగా సత్కరించడం… చాలా గర్వపడుతున్నానని ఆమె అన్నారు. అమ్మ పాత్ర కీర్తి సురేష్‌ బాగా చేశారని, అమ్మను చూడాలనిపించినప్పుడు తననే చూస్తానని కీర్తి సురేష్‌తో అన్నానని విజయ చెప్పారు. తనకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, చిత్ర నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.