మహారాణా ప్రతాప్‌ మేటి చక్రవరి

 

అక్బర్‌ కన్నా అయనే ఘనాపాటి

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంలో యూపి సిఎం యోగి

లక్నో,జూన్‌15(జ‌నం సాక్షి ): మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కన్నా.. 16వ శతాబ్దానికి చెందిన మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ గొప్పవాడని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. అలాగే అలహబాద్‌కు పాతపేరైన ప్రయాగను ఖరారు చేయనున్నామని అన్నారు. ఇందుకోసం ఒత్తిడి వస్తోందన్నారు. మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో పాల్గొన్న యోగి మాట్లాడుతూ.. అక్బర్‌ను చక్రవర్తిగా రాణాప్రతాప్‌ చూడలేదన్నారు. తుర్క్‌ చక్రవర్తులను నమ్మలేమని రాణా ప్రతాప్‌ పేర్కొన్నట్లు సీఎం యోగి తెలిపారు. తనను బాదుషాగా గుర్తించాలని మహారాణా ప్రతాప్‌ను ఆక్బర్‌ అడిగారని, అలా చేస్తే మేవార్‌ రాజ్యంపై దాడి చేయబోమని అక్బర్‌ చెప్పారని, కానీ మహారాణా ప్రతాప్‌ దీనికి అంగీకరించలేదని యోగి తెలిపారు. ఓ విదేశీ వ్యక్తిని, విధర్మాన్ని పాటించేవారిని చక్రవర్తిగా చూడలేమని మహారాణా ప్రతాప్‌ తనకు అందిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు సీఎం యోగి గుర్తు చేశారు. ధైర్యసాహాసాలతో కోటలను గెలుచుకుని మహారాణా తన గొప్పతనాన్ని చాటుకున్నారని, అక్బర్‌ చక్రవర్తి కాదు అని యోగి అన్నారు. జైపూర్‌ రాజు మాన్‌ సింగ్‌ దూతగా వచ్చినా.. ప్రతాప్‌ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారన్నారు. అలహాబాద్‌ను ప్రయాగగా మార్చాలని యూపీ ప్రభుత్వం భావిస్తున్నది. ఆ సంగమ నగరాన్ని ప్రయాగగా పిలువాలని సాధువులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్‌ త్వరలోనే అలహాబాద్‌ పేరును ప్రయాగగా మార్చేందుకు అంగీకరించబోనున్నట్లు తెలుస్తోంది.