మహా సంగ్రామానికి సిద్ధం కండి
కేంద్రం తెలంగాణ ఇస్తదని నమ్మకం లేదు..
మహా సంగ్రామానికి సిద్ధం కండి
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెగించి కొట్లాడుదాం
జేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్,జనగాం,జూలై 4(జనంసాక్షి):
దేవుడే దిగివచ్చినా తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి కన్పించడంలేదని, కేంద్రం తెలంగాణ ఇచ్చేట్టు లేదని తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ కదండరాం అన్నారు. దొడ్డి కొమురయ్య 66వ వర్దంతి సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎన్ని పోరాటాలు చేసిన కేంద్రంలో చలనం లేదని, కేంద్రం తెలంగాణ ఇచ్చేటట్టు లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలంతా మహా సంగ్రా మానికి సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భూమి కోసం, తెలంగాణ ప్రజల కోసం నైజాంను ఎదిరించిన వీరుడు కొమురయ్య అనీ, తెలంగాణ పోరాటంలో తొలి అమరుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతాడన్నారు. తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదని వీరుడు కొమురయ్య అనీ, ఆయన అమరత్వం పోరాటాలకు ఊపిరైందన్నారు. తెలంగాణ అంటేనే పోరాటం అనీ, కొమురయ్య స్పూర్తితో మహా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపనిచ్చారు. మన సంపదను, నీళ్లను ,దోచిన ఆంధ్రోళ్లను తరిమికొట్టేవరకు పోరాటం ఆపేది లేదని, నిజాం నవాబునే గడగడలాడించిన తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర పాలననుండి విముక్తి పొందే వరకు మరోమారు స్వాతంత్య్ర సంగ్రామానికి సిద్దం కావాలన్నారు. అలాగే జేఏసీ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ మల్లెపల్లి రాజ్యం స్పూర్తితోనే ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్నాని, దొడ్డికొమురయ్య స్పూర్తితో కడవెండి ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలన్నారు.