మహిళను బలిపశువును చేశారు

4

– రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ,ఆగస్టు 2(జనంసాక్షి): గుజరాత్లో నాటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హయాం నుంచి జరుగుతూ వస్తున్న అవకతవకలకు, అసమర్థ పాలనకు  ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌/-ను బలి చేశారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాజా ఘటనలతోనే ఆమెరాజీనామా చేయలేదన్నారు. వారసత్వంగా వచ్చిన పాలనాపరమైన వైఫల్యాలు ఆమె మెడకు చుట్టారని అన్నారు. ఆనందిబెన్‌  రాజీనామా అంశంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఆమెను బలిపశువును చేశారని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులకు రెండేళ్ల ఆనందీబెన్‌ పాలన కారణం కాదని, 13ఏళ్ల మోదీ పాలన వల్లే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని విమర్శించారు. ఆమె త్యాగం బిజెపిని  కాపాడలేదంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ఆనందీబెన్‌ రాజీనామా చేయడానికి కారణం.. గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ వేగంగా విస్తరించడమే నన్నారు. . భాజపా ఈ విషయంలో భయపడుతోంది అంటూ కేజీవ్రాల్‌ ట్వీట్‌ చేశారు. 75ఏళ్లు నిండుతున్న తనను పదవీ బాధ్యతల నుంచి తప్పించాలని భాజపా నాయకత్వానికి ఆనందీబెన్‌పటేల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పటేల్‌ ఆందోళన, దళితుల ధర్నా ఘటనలతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆనందీబెన్‌ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.