మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ప్రారంభించిన సీఎం రేవంత్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం శనివారం అసెంబ్లీ వేదికగా ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్‌ను సీఎం ఆవిష్కరించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతి కుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణ నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు