మహిళలకు దక్కిన అరుదైన అవకాశం

5

– నామినేషన్‌ ఖరారైన సందర్భంగా హిల్లరీ ఉద్వేగ ప్రసంగం

న్యూయార్క్‌,జులై 29(జనంసాక్షి): డెమొక్రటిక్‌ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌ ప్రచారంలో దూసుకుని పోతున్నారు. రోజురోజుకు ఆమెకు మద్దతు పెరుగుతోంది. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌లా తను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని డెమొక్రటిక్‌ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌ అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా హిల్లరీ నామినేషన్‌ ఖరారు అయింది. ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిలడెల్ఫియాలో డెమొక్రటిక్‌ పార్టీ కన్వెన్ష్‌లో తన కీలక ప్రసంగంతో హిల్లరీ ఆకట్టుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పార్టీ తరఫున నామినేషన్‌ స్వీకరణ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన ప్రత్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌పై మాటల తూటాలను పేల్చారు. అమెరికా విచ్ఛిన్నాన్ని ట్రంప్‌ కోరుతున్నారని ఆమె ఆరోపించారు. అందుకే ట్రంప్‌ను నమ్మవద్దని హిల్లరీ అమెరికన్లకు సూచించారు. అమెరికా కంటే ట్రంప్‌కు స్వప్రయోజనాలే ముఖ్యమని ఆమె ఆరోపించారు. అమెరికా బలహీనంగా ఉందంటూ రిపబ్లికన్‌ అభ్యర్థి చేసిన ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఒబామా నేతృత్వంలో దేశం బలంగా ఉందని అన్నారు. తనకు మద్దతు ప్రకటించిన సాండర్స్‌కు హిల్లరీ కృత్ఞతలు తెలిపారు. దేశ చరిత్రలో ఒక మహిళకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్‌ దక్కడం ఇదే తొలిసారి అని ఆమె గుర్తు చేశారు. ఇదో అద్భుత పరిణామంగా ఆమె అభివర్ణించారు. మన దేశ చరిత్రలో ఇదో మైలు రాయని, ఒక పెద్ద పార్టీ మహిళను అధ్యక్ష పదవికి నామినేట్‌ చేసిందని హిల్లరీ అన్నారు. నా తల్లికి కూతురుగా, నా కుమార్తెకు తల్లిగా తాను ఇక్కడ నిలబడ్డానని ఆమె అన్నారు. మహిళలు, బాలికలకు ఇది ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. అంతే కాదు బాలురు, పురుషులు కూడా ఇది ఆనందించదగ్గ విషయమని హిల్లరీ అన్నారు. పైకప్పు లేనప్పుడే ఆకాశానికి హద్దులు చెరిగిపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంతకు ముందు హిల్లరీ కుమార్తె చెల్సియా క్లింటన్‌ అద్భుతంగా ప్రసంగించారు. మా అమ్మే నా హీరో అంటూ ఆమె ప్రసంగించారు. సేవా అంటే ప్రజా సేవే తన తల్లి అనుకుంటుందని ఆమె అన్నారు. హిల్లరీ ఇన్ని పనులు ఎలా చేస్తున్నారని తనను చాలా మంది అడిగారని, తన తల్లి దేనిపై పోరాడుతున్నారో ఆ అంశాన్ని ఎప్పటికీ మర్చిపోరని చెల్సియా చెప్పడంతో సభ ప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది. మొత్తంవిూద డెమొక్రటిక్‌ జాతీయ సదస్సులో హిల్లరీ, ఆమె కుమార్తె చెల్సియా తమ ప్రసంగాలతో అమెరికన్లను ఆకట్టుకున్నారు.