మహిళల ఆగ్రహంతో కారు దిగొచ్చిన రాహుల్

555అమేథి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. తన నియోజకవర్గం అమేథికి వస్తున్న ఆయనను పలువురు మహిళలు ఘెరావ్ చేశారు. తమ దినసరి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆయన వెళుతున్న కారులో నుంచి దిగి వారి సమస్యలు విని సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరహా ఆందోళనను ఎదుర్కోవడం ఇది రాహుల్ గాంధీకి రెండు రోజుల్లో రెండోసారి.

రాహుల్ అమేథి పర్యటనకు వస్తున్నారని తెలుసుకొని గౌరీగంజ్ పట్టణానికి చెందిన మహిళలు ఆయన వచ్చే మార్గంలో వేచి ఉండి ఆయన వచ్చే సమయంలో గట్టిగా నినాదాలు చేస్తూ ప్రకంపనలు సృష్టించారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినా అది విజయవంతం కాలేదు.

కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రాహుల్ కారు దిగి వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పలువురు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అంతకుముందు రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిథి కేఎల్ శర్మను బాధ్యతలనుంచి తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు అతడి మద్దతుదారులు ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే