మహిళా కానిస్టేబుల్‌ చేసిన పని నన్నెంతో కదిలించింది

త్వరలోనే ఆమెను నేనే కలుస్తా
ట్వీట్‌ చేసిన కన్నడ సీఎం కుమారస్వామి
బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : కన్నబిడ్డ తనకు అక్కర్లేదని ఓ తల్లి వదిలేస్తే.. మరో తల్లి ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది. పాలిచ్చి ఆ చిన్నారికి అమ్మయ్యింది. ఆమే బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్‌ అర్చన. అమ్మగా అర్చన చేసిన పనిని సామాజిక మాధ్యమాల వేదికగా ఎందరో అభినందిస్తున్నారు. తాజాగా కర్ణాటక నూతన ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా స్పందించారు. ట్విటర్‌ ద్వారా అర్చనను ప్రశంసించారు. ‘విూడియా ద్వారా చిన్నారి వార్త తెలిసింది. మహిళా కానిస్టేబుల్‌ చేసిన పని నన్నెంతో కదిలించింది. ఆమె గొప్ప తల్లి. త్వరలోనే ఆమెను నేను కలుస్తా’ అని కర్ణాటక సీఎం ట్వీట్‌ చేశారు. ఇటీవల బెంగళూరు శివారులోని ఓ నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఎ/-లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన బిడ్డను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిడ్డను తీసుకుని స్టేషన్‌కు వెళ్లారు. ఆ బిడ్డ బాలుడు అని తెలిసింది. చిన్నారి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో అక్కడే ఉన్న అర్చన వెంటనే బాబును పక్కకు తీసుకెళ్లి పాలిచ్చింది. అలా అమ్మగా స్పందించి బిడ్డను కాపాడింది. అర్చన మూడు నెలల బాలింత. ఇటీవల మాతృత్వ సెలవులు ముగించుకుని తిరిగి విధుల్లో చేరింది. అర్చన చేసిన పనికి అక్కడున్నవారే గాక.. ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ చిన్నారిని పోలీసులు ప్రభుత్వ బిడ్డగా ప్రకటించి.. ముఖ్యమంత్రి కుమారస్వామి పేరు పెట్టడం విశేషం. బాలుడిని బెంగళూరులోని శిశుమందిర్‌కు అప్పగించారు. చిన్నారి బాధ్యత పోలీసులే తీసుకోనున్నారు.