మాకు సహనం ఉంది

4

– ప్రధాని మోదీ

హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి): కేరళ భాజపా కార్యకర్తలకు ఎంతో సహనం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. తొలిసారి కేరళ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం త్రిసూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేరళ భాజపా కార్యకర్తల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారని, ఆయా ఘటనల్లో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. కేరళలో సాధువులు సామాజిక అంటరానితనం లేకుండా చేశారన్నారు. కానీ కేరళలో కొందరి వల్ల రాజకీయ అంటరానితనం ఇంకా పోలేదని వ్యాఖ్యానించారు.

కేరళకు మోదీ క్షమాపణలు

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 19 నెలల తర్వాతగానీ కేరళ రాష్ట్రానికి రాలేకపోయానని, అందుకే కేరళకు క్షమాపణలు చెబుతున్నానని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం త్రిసూర్‌ పట్టణంలో భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేరళలో బీజేపీ దారుణ రాజకీయ హింసను ఎదుర్కున్నదన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో భారతీయ జనతాపార్టీ ఘోర రాజకీయ హింసను ఎదుర్కొంది. ఇతర పార్టీల చేతుల్లో వందలాది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరులకు నివాళులర్పిస్తున్నా. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కార్యకర్తల కృషితో కేరళలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలు మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు’ అంటూ భావోద్వేగంగా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి అందాలకే కాక, మానవ వనరులకూ నిలయంగా ఉన్న కేరళ నుంచి లక్షలాది యువత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుకుంటున్నదని, తన విదేశీ పర్యటనల సందర్భంలో కేరళ ఎన్నారైలతో ముచ్చటించిన విషయాలను మోదీ గుర్తుచేసుకున్నారు. విదేశాల్లో కేరళీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదేశాధినేతలతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎన్డీఏ సర్కార్‌ కృషిచేస్తున్నదనన్నారు. కేరళ యువశక్తి, వారి ప్రతిభాపాటవాలు.. తాము తలపెట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదని ప్రధాని అన్నారు. 2022లో భారత్‌ 75వ స్వాతంత్య్రదినోత్సవాన్ని జరుపుకోనుంది. ఆలోగా ప్రతి పౌరుడి సొంత ఇంటి కలను సాకారం చేయాలన్నది తన కల. అని ప్రధాని మోదీ తెలిపారు. కేరళలో మత్యకారుల అభివృద్ధి కోసం త్వరలో భారీ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా కేరళలోని 2.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2100 కోట్లు సమకూరాయని ఆయన పేర్కొన్నారు.

కేరళ సిఎంను దూరంపెట్టారన్న ఆరోపణలు సరికాదు: రాజ్‌నాథ్‌

కేరళ సీఎం ఒమెన్‌ చాందీని ప్రధాని మోదీ అవమానించారని రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. లోకసభలో ఈ అంశంపై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరణ ఇచ్చారు. కేరళ మాజీ కాంగ్రెస్‌ నేత ఆర్‌. శంకర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో  ప్రధాని మోదీ పాల్గోనున్నారు. ఆ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం ఒమెన్‌ చాంఢీని దూరం పెట్టారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒమెన్‌ను అడ్డుకునే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. రాహుల్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కేరళ ప్రభుత్వంతో మాకు ఎటువంటి ఘర్షణ లేదని, సీఎం రావొద్దని ప్రధాని ఎప్పుడూ సూచించలేదని, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంస్థే రాష్ట్ర సీఎం రాకను అడ్డుకుందని రాజ్‌నాథ్‌ అన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ నారాయణ ధర్మ పరిపాలన సంస్థ ఆ రాష్ట్ర సీఎంకు ఆహ్వానం పంపలేదని కేంద్ర ¬ంమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం అందరి సహకారం కోరుతోందన్నారు. కొల్లామ్‌ కాలేజీలో జరిగే కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ఆ రాష్ట్ర సీఎం లేఖ విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి రూఢీ లోకసభలో తెలిపారు.