మాజీ సీఎం రోశయ్య ఇకలేరు


` రాజకీయాల్లో ముగిసిన ఓ శకం
` ఉదయం పల్స్‌ పడిపోవడంతో ఆకస్మిక మృతి
` మంత్రిగా,సీఎంగా,గవర్నర్‌గా కీలక బాధ్యతల నిర్వహణ
` నివాళి అర్పించిన సీఎం కేసీఆర్‌, సిజె రమణ
` ప్రధాని నరేంద్ర మోదీ,సోనియా గాంధీ సంతాపం
` రోశయ్య మృతికి మూడ్రోజుల సంతాప దినాలు
` నేడు అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు
` గాంధీభవన్‌లో నేడు ప్రజల సందర్శనార్థం భౌతిక కాయం తరలింపు
హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి):రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నిజాయితీ రాజకీయాలకు ఆద్యుడిగా పేరొందిన రాజకీయ దురంధురుడు …ఉమ్మడి ఆంధప్రదేశ్‌ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. 88 ఏళ్ల రోశయ్యకు ఉదయం ఒక్కసారిగా పల్స్‌ పడిపోయింది. దీంతో వెంటనే ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ అవిూర్‌పేట్‌లోని ఆయన ఇంటి నుంచి స్టార్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్దారించారు. బంజారాహిల్స్‌ స్టార్‌ ఆసుపత్రి నుంచి రోశయ్య నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. ఆయన మృతికి రాజకీయ, సినీ తదితర ప్రముఖులు నివాళి అర్పించారు. ఆదివారం గాందీభవన్‌కు ప్రజల సందర్శనార్థం తరలిస్తారు. రోశయ్యనివాసానికి వెళ్లిన సిఎం కెసిఆర్‌, సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణలు ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. ఆయనకు పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మృతికి ఎపి సిఎం జగన్‌, మాజీ సిఎం చంద్రబాబు, మంత్రులు సంతాపం ప్రకటిం చారు. అధికార లాంఛనాలతో ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. రోశయ్య మృతితో రాష్ట్రంలో మూడు రోజుల సంతాపదినాలు ప్రకటించారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్‌ అభ్యసిం చారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయ కుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న రోశయ్యను.. ఎన్నో పదవులు వరించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహ నిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు.. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ బాధ్యతలు చేపట్టారు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు నిర్వర్తించారు. 1992లో కోట్ల విజయ భాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 1995`97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఏపిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మరోసారి శాసన మండలికి ఎంపికయ్యారు. వై.యస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనూ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.
రోశయ్య మృతికి ప్రధాని సంతాపం
మాజీ సీఎం రోశయ్య మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తాను, రోశయ్య ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ప్రధాని అన్నారు. గవర్నర్‌గా పని చేసినప్పుడు రోశయ్యతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. రోశయ్య సేవలు మరువలేనివన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళనాడు మాజీ గవర్నర్‌, ఉమ్మడి ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబ సభ్యులకు గవర్నర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.రోశయ్య మృతితో దేశం ఒక గొప్ప అనుభవజ్ఞుడైన నాయకున్ని కోల్పోయిందని గవర్నర్‌ అన్నారు. వారి మరణం తెలుగు రాష్టాల్రకు తీరని లోటు అని,రాజకీయాలలో, ప్రజాజీవనంలో రోశయ్య అత్యున్నత ప్రమాణాలు పాటించారని, వారి ఆదర్శాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని గవర్నర్‌ తెలిపారు.
రోశయ్య మృతికి సోనియాగాంధీ సంతాపం
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. రోశయ్య మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భాంª`రతి వ్యక్తం చేశారు. ‘ఆంధప్రదేశ్‌ పూర్వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్టాన్రికి దిశానిర్దేశం చేసిందని‘ ఆయన ట్వీట్‌ చేశారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని‘ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్‌ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్‌ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్‌ రావ్‌తో రాహుల్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను రాహుల్‌కు కేవీపీ వివరించారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్టాల్రు కోల్పోయామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ఆయనతో అసెంబ్లీలో కలిసి పనిచేసి చాలా విషయాలు నేర్చుకు న్నానని కృష్ణదాస్‌ అన్నారు. ?కొణిజేటి రోశయ్య పట్ల ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్తితి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్‌ రాజశేఖరరెడ్డికి రోశయ్య అత్యంత సన్నిహితులన్నారు. ఆయనకు భగవంతుడు ఆత్మశాంతి ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాన్నారు.
రోశయ్య మృతికి మంత్రులు కేటీఆర్‌,హరీశ్‌ సంతాపం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నివాళి అర్పించారు. కొణిజేటి రోశయ్య మరణం బాధాకరమని తన ట్వీట్‌లో కేటీఆర్‌ తెలిపారు. ఓ సందర్భంలో రోశయ్యతో దిగిన ఫోటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌లో పోస్టు చేశారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌లో చెప్పారు. రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భార్రతి వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తెలుగు రాష్టాల్రకి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన రోజులను సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని సబిత తెలిపారు. రోశయ్య మరణం తెలుగు రాష్టాల్రకు తీరని లోటని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్న రోశయ్య మృతిచెందడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు.దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర శాసన సభలో 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఆయన చేయని పదవిలేదు, గౌరవం లేదన్నారు. ఆయన పనిచేసిన అందరు సీఎంలో మన్ననలు పొందారని చెప్పారు. రోశయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తనను ఎంతో ప్రోత్సహించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయతో కలిసి మంత్రిగా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మృతి పట్ల .. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె తన ట్విట్టర్‌లో రోశయ్య మృతి పట్ల స్పందించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు ఆమె ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎన్నో కీలక పదవులను అలంకరించిన రోశయ్య ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని, ఆయన మరణం వారందరిలో తీవ్ర విషాదాన్ని నింపినట్లు ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్‌లో తెలిపారు.