మాటలతో ఎంతోకాలం మభ్యపెట్టలేరు: కాంగ్రెస్‌

మహబూబాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని మహబూబా బాద్‌ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మాటలు తప్ప చేతలు మాత్రం అడుగు దాటడం లేదని తెరాస ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నేతల పార్టీ ఫిరాయింపులపై తప్పితే రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడంపై సీఎం దృష్టి సారించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కనీసం తమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం కలుసుకునేందుకు సీఎం అవకాశం ఇవ్వడం లేదని ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిపక్షాలకు పది సీట్లు కూడా రావంటున్న సీఎం దమ్ముంటే ఫిరాయింపులు జరిగిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు కాంగ్రెస్‌దేనని అన్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశపడితే తెరాస ప్రభుత్వం అన్ని వర్గాలను వంచించిందన్నారు. అనుభవం, పాలనా దక్షత, క్రమశిక్షణ కలిగిన పార్టీ వైపే తెలంగాణ ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రచారానికే పరిమితమై అన్ని రంగాలలో విఫలమవుతున్న తెరాస తీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తెరాస వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమన్నారు. ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందన్నారు. తెరాసది అంతా మాటల ప్రభుత్వమని అన్నారు.