మాట తప్పితే ‘ఛలో అసెంబ్లీ ‘ : కోదండరాం
హైదరాబాద్: డిసెంబర్ 10 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్ర పార్టీలు తెలంగాణపై తీర్మానం చేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. నోమా ఫంక్షన్ హాల్‌లో జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్ర పార్టీలు మాట తప్పితే బడ్జెట్ సమావేశాల ముందు ‘ ఛలో అసెంబ్లీ ‘ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాకపోతే అనుకూలమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేయించే బాధ్యత ఆ పార్టీల్లోని తెలంగాణ నేతలదేనని చెప్పారు. సీమాంధ్ర పార్టీలన్నీ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్దంగా పని చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసమే పని చేస్తున్నదని ఆరోపించారు. డిసెంబర్ 9న తెలంగాణ సాధన దినం… ఆ రోజున కాగడాల ప్రదర్శినలతో స్ఫూర్తి కార్యక్రమాలు చేపడుతామని తెలియజేశారు. డిసెంబర్ 23ను విద్రోహ దినంగా పాటించాలని, వాడవాడలా నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే నియోజకవర్గాల్లో ప్రచార యాత్రలు చేపడుతామని పేర్కొన్నారు.