మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగాలి

అన్ని భాషాలూ నేర్చుకోవాల్సిందే
మన సంస్కృతి,సంప్రదాయాలను వీడరాదు
ఆరోగ్యం కోసం యోగా చేయాల్సిందే
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూస్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో వెంకయ్య

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): అన్ని భాషలూ నేర్చుకోవాలి… కానీ మాతృభాషను మరిచిపోకూడదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సంగీతం, సాహిత్యం మన రోజు వారి జీవితంలో భాగం అవ్వాలని వెంకయ్య చెప్పారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య, తెలంగాణ హోమ్‌ మినిస్టర్‌ మహమ్మద్‌ అలీ శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో మాతృభాషపై తనకున్న మమకారాన్ని మరోసారి వ్యక్తం చేశారు. మాతృభాషపై పట్టుండాలి… బేసిక్‌ విద్యాభ్యాసం మాతృభాష లోనే ఉండాలని తెలిపారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారు ఎవరూ ఇంగ్లీషు విూడియంలో చదవలేదని, అయినా ఉన్నత స్థాయికి వచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ స్కిల్స్‌ పెంచుకోవాలన్న ఆయన.. క్యారెక్టర్‌ ని బిల్డ్‌ చేసుకోవాలని సూచించారు. భవిష్యత్‌ లో ఎదుగుదలకు క్రమశిక్షణ, సమయ పాలన అత్యంత అవసరమని తెలిపారు. తాను చూసిన చాలా పాఠశాలల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ చాలా ప్రత్యేకమైనదనిగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా అలర్ట్‌ గా ఉంటామని, రోజూ మన శరీరానికి వ్యాయామం అవసరమని ఉప రాష్ట్రపతి వెంకయ్య అన్నారు. యోగ అనేది మోడీది కాదన్న ఆయన.. మనబాడీ కోసం వ్యాయామం చేయాలని చెప్పారు. వ్యాయామానికి కుల మతాలు లేవని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ వారిజు వారీ జీవితంలో జంక్‌ ఫుడ్‌ కాకుండా మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. నేచర్‌ చాలా ముఖ్య మైనదని… నేచర్‌ ని నెగెలేక్ట్‌ చేస్తే చాలా ప్రమాదమని వెంకయ్య హెచ్చరించారు. కల్చర్‌ ను, ప్రకృతిని ప్రేమిస్తూ జీవిస్తేనే మనకు భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. గతంలో మన భారత దేశం ప్రపంచంలోనే ధనిక దేశంగా ఉండేదన్నారు. జీవితంలో వ్యక్తిత్వం పెంచుకోవాలని, పక్క వారి కోసం జీవించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదాయాన్ని పెంచుకో… పక్క వారితో పంచుకో అనే మాటను విద్యార్థులకు తెలియజేశారు. చదువు కోసం చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. ఒక వేళ వెళ్లినా దేశం కోసం పని చేయడానికి మాతృ దేశానికి రావాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయులు విద్యతో పాటు వినయం, విలువలను నేర్పాలని ఈ సందర్భంగా వెంకయ్య చెప్పారు. మర్యాద నేర్చుకోమన్న ఆయన.. పక్క వారికి సహాయం చేసే అలవాటు చేసుకోండని సలహా ఇచ్చారు. అన్ని రాష్టాల్ల్రో ఆక్రమణలు పెరిగాయన్న ఆయన… మూసీ నది ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయని స్పష్టం చేశారు.

తాజావార్తలు