మాదిగలను అంతం చేసేందుకు..  కేసీఆర్‌ కుట్ర – ఓదేలు ఏం అ

న్యాయం చేశారని టికెట్‌ నిరాకరించారు
– తెరాస ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది మాదిగలే
– కేసీఆర్‌ అంతం.. మాదిగల పంతంగా ముందకెళ్తాం
– ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
అదిలాబాద్‌, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : మాదిగ జాతిని అంతం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో మాదిగ జాతిని అణగదొక్కే ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఓదేలుకు టికెట్‌ నిరాకరించారన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్న రేగుంట గట్టయ్య మృతదేహానికి బుధవారం మందకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓదేలు ఏ అన్యాయం చేశారని టికెట్‌ నిరాకరించారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అక్రమాలు, అవినీతి చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కొనసాగించి.. నీతిగా, న్యాయంగా బాధ్యతలు నిర్వహించిన మాదిగ బిడ్డ ఓదేలుకు టికెట్‌ నిరాకరించడం అన్యాయమని మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు గర్జిస్తున్నామని, కేసీఆర్‌ అంతమే మాదిగల పంతం అని మందకృష్ణ ధ్వజమెత్తారు. శవరాజకీయాలకు పెట్టింది పేరు కేసీఆర్‌ అని మందకృష్ణ  విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది మాదిగలేనని.. మంత్రి వర్గంలో సైతం మాదిగలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. దళిత ముఖ్యమంత్రి అన్న కేసీఆర్‌.. నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల పై కుట్ర పన్నారని విమర్శించారు. దొర అహంకారానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని, మాదిగల సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు. మాదిగ మహిళ నాయకురాలు బోడిగశోభను తప్పించి అక్కడ కూడా మాలకే టికెట్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో లాఠీ దెబ్బలు తిన్నది మాదిగలేనని, థర్డ్‌ డిగ్రీ నరకం చూసింది కూడా మాదిగ బిడ్డలేనని మందకృష్ణ అన్నారు.  మాదిగలను అణగదొక్కేందుకు యత్నిస్తున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు మాదిగలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తాజావార్తలు