మాయవతికి మద్ధతుగా దేశవ్యాప్త ఆందోళనలు
– అణగారిన వర్గాల ప్రతినిధిని నేను: మాయావతి
లక్నో,జులై 21(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బహుజన సమాజ్ వాది పార్టీ భారీ ఆందోళనకు దిగింది. హజరత్‌గంజ్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం ముందు జరుగుతున్న ఈ ధర్నాకు వేలాది మంది ఆ పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. తమ అభినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అయితే దిష్టిబొమ్మకు నిప్పు పెట్టే సమయంలో ఓ కార్యకర్తకు మంటలు అంటుకున్నాయి. వెంటనే పక్కనున్నవారు మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. అలాగే ఢిల్లీలో కూడా బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ అధినేత్రి మాయావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్ వద్ద గురువారం జరిగిన ఈ ధర్నాలో భారీగా బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే భోపాల్ అసెంబ్లీ ముందు బీఎస్పీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. తమ నేతపై అసభ్యకరవ్యాఖ్యలు చేసిన దయాశంకర్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దయాశంకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అణగారిన వర్గాలకు తాను దేవతనన్న మాయావతి
మాయావతిపై భాజపా నేత దయాశంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనపై మాయావతి స్పందించారు. నిరుపేదలకు తాను ఓ దేవత లాంటిదాన్నని.. తనను కించపరిచేలా మాట్లాడటంతో వారు ఆగ్రహం చెంది ఆందోళన చేస్తున్నారని ఆమె అన్నారు. అణగారిన వర్గాలు తనను దేవతలా కొలుస్తారని అన్నారు. ఈ సందర్భంగా తనకు అండగా ఉన్న కార్యకర్తలను కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. భాజపా మొక్కుబడిగా మాత్రమే దయాశంకర్‌ను సస్పెండ్ చేసిందని ఆరోపించారు. ఆ పార్టీని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన దయాశంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే సరిపోదని.. అతడ్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. మాయావతిని కించపరిచేలా మాట్లాడిన ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బీఎస్పీ కార్యకర్తలు దయాశంకర్‌పై ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక పలుచోట్ల ఆందోళనలతో బిఎస్పీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ ఖబడ్దార్..ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి..అతని జైల్లో పెట్టాలి..అంత వరకు పోరాడుతూనే ఉంటాం’ అంటూ బీఎస్పీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతిపై దయాశంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేతలే కాకుండా పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పలు ప్రాంతాల్లో బీఏస్పీ నేతలు ఆందోళన నిర్వహించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద నేతలు ఆందోళన చేపట్టారు. దయాశంకర్ ను అరెస్టు చేయాలని, ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆందోళన చేపట్టిన బీఎస్పీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దయాశంకర్ నాలుకకు 50 లక్షలు
యూపీ బిజెపి ఉపాధ్యక్షుడిగా బహిష్కృతుడైన దయాశంకర్ సింగ్ నాలుక తీసుకువచ్చినవారికి 50 లక్షల రూపాయలు ఇస్తామని బిఎస్పీ నాయకురాలు జన్నత్ జహాన్ ప్రకటించారు. జన్నత్ జహాన్ బిఎస్పీ చండీఘర్ చీఫ్‌గా ఉన్నారు. దయాశంకర్ సింగ్ నిన్న బిఎస్పీ అధినేత్రి మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే బిజెపి అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది.బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయవతిని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా బహిష్కృత నేత దయాశంకర్‌సింగ్‌ను అరెస్టు చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేసారు. ఈ మేరకు యూపీలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. వందలాది మంది బిఎస్పీ కార్యకర్తలు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. బీఎస్పీ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో పటిష్ఠ భద్రతాచర్యలు చేపట్టారు. మరోవైపు దయాశంకర్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినవిషయం తెలిసిందే. దయాశంకర్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు గురువారం ఉదయం ఆయన నివాసానికి చేరుకున్నారు. మాయవతి రూ.కోటి తీసుకుని టికెట్ ఇస్తారు. ఎవరైనా రూ.2 కోట్లు ఇస్తామంటే మరో గంటలో వారికే టికెట్ ఇస్తారు. ఆమె ఎంత నీచురాలంటే.. అంటూ ఆమెను కించపరిచేలా దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దయాశంకర్ వ్యాఖ్యలపై బీఎస్పీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పార్లమెంటులో దుమారం చెలరేగింది. దీనిని బిజెపి అగ్రనేతలు కూడా తీవ్రంగా ఖండించారు. ఇక కేసునమోదు కావడంతో దయాశంకర్ సింగ్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఆయనను అదుపులోకి అరెస్ట్ చేసేందుకు పోలీసుల బృందం బలీయా జిల్లాలో గల ఆయన నివాసానికి చేరుకుంది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు యూపీలో జరుగుతున్న అల్లర్లపై స్పందిస్తూ.. దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ ఆయనపై ఇప్పటికే క్రమశిక్షణ చర్యలను తీసుకుంది. ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. సమస్య అంతటితో ముగిసింది. అయినప్పటికీ వారు ఆందోళనలు చేస్తున్నారు. వారి ప్రధాన ఎజెండా యూపీలో దూసుకెళ్తున్న బీజేపీని నిలువరించాలని చూడటమేనని ఆయన పేర్కొన్నారు. అయితే లక్నోలో మాత్రం బిఎస్పీ కార్యకర్తలు పలుచోట్ల బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దయాశంకర్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు.