మారూమూల ప్రాంతాలకు కూడా వైద్య సదుపాయాలు

ఆసిఫాబాద్‌లో త్వరలో మెడికల్‌ కాలేజీ
పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్‌ రావు
కొమురంభీం,మార్చి4( జనంసాక్షి ) :  ఆసిఫాబాద్‌ ప్రాంతం అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావని, వానాకాలం వస్తే డయేరియా, అంటు రోగాలు ఉండేవని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఏ అనారోగ్యం వచ్చినా హైదరాబాద్‌ కు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు హైదారాబాద్‌ కు పోవాల్సిన అవసరం లేకుండా గాంధీ, ఉస్మానియా స్థాయి వైద్యం ఇక్కడ అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవల కొరత లేకుండా ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.స్థానిక ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు కాగజ్‌ నగర్‌, ఆసిఫాబాద్‌లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. 60 ఏళ్ల పాలనలో కేవలం 3 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉంటే, తెలంగాణ ఏర్పాటు తర్వాత 17 కు పెంచుకున్నామని మంత్రి వెల్లడిరచారు. త్వరలోనే ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో కూడా వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో 60 కోట్ల రూపాయలతో అధునాతన దవాఖాన భవనాన్ని నిర్మించనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం జిల్లాలో మంత్రి ఐకేరెడ్డి తో కలిసి హరీశ్‌ రావు పర్యటించారు. జైనూర్‌, కెరమెరి దవాఖానలను తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలో 60 కోట్ల రూపాయలతో 340 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు.
అలాగే కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహింస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్‌, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.