మార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యం
మహబూబ్‌నగర్,మే4(జనం సాక్షి): ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీవర్షం పడిన కారణంగా నస్టం కూడా భారీగానే ఉందని అంచనా. ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లకు వరిధాన్యాన్ని తీసుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ధరూర్ మండలంలో ఈదురుగాలులతో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వ్యాపించి వర్షం మొదలైంది. బాలానగర్, నవాబుపేట, నారాయణపేట, దేవరకద్ర కల్వకుర్తి, తలకొండపల్లి, అడ్డాకుల, ఖిల్లాగణపురం, మాడ్గుల, రాజోలి, గండీడ్, తాడూరు, చారకొండ, గద్వాల, మానవపాడు మండలాల్లో భారీవర్షం పడింది. దీంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈదురుగాలులకు చెట్లు పడిపోయాయి. పెద్ద మాడ్గుల ఊరి చివర నీటివాగులో కొద్దిదూరం ఓ కారు కొట్టుకుపోయింది. మధ్యలో ఆగిపోవడంతో కారులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. గండీడ్ మండలంలో వడగండ్లతో కూడిన వర్షం పడింది. నాగర్‌కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని శిర్సనగండ్ల శివారులో వ్యవసాయ పొలంలో పిడుగు పడి ఓ ఎద్దు మృత్యువాత పడింది. వెల్దండ మండలంలోని కుప్పగండ్ల గ్రామం మైసమ్మపల్గు తండాలో తడిసిన పశువులపాక గోడ కూలి శంకర్‌నాయక్ (22) అక్కడికక్కడే మృతిచెందాడు. పదర మండలంలో మేకల కాపరిగా వెళ్లిన మహిళ వంకేశ్వరం వాగులో గల్లంతయింది.