మావారి జాడ చెప్పండయ్యా..!
హైదరాబాద్, జూలై 14 (జనంసాక్షి) : తమ వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల బంధువులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వంతెన తెగిపోవడంతో అవతలి వైపే వారు ఉండిపోయారని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు సెల్‌ఫోన్లు పనిచేశాయని, ఆ తర్వాత తమ వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం లేదని శనివారంనాడు వారు మీడియాకు తెలిపారు. సెల్‌ఫోన్లు కూడా పనిచేయడం లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నదీ.. ఎలా ఉన్నదీ తెలీడం లేదని వాపోతున్నారు. శుక్రవారంనాడు జీపు మార్గం ద్వారా ముక్తిథామం యాత్ర ముగించుకుని కొందరు యాత్రీకులు వస్తుండగా వంతెన కూలడం.. అక్కడ 30మంది తెలుగువాళ్లు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిలో 15 మంది హైదరాబాద్ వాసులేనన్న విషయం విదితమే. నేపాల్ ప్రభుత్వాన్ని సంప్రదించినా ఎటువంటి స్పందన రావడం లేదని వాపోయారు. వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తిరిగి రావాలని దేవదేవుడ్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా హైదరాబాద్-సికింద్రాబాద్‌లకు చెందిన 15మంది యాత్రికులు గత నెల 26వ తేదీన మానస సరోవరం, ముక్తిథామం యాత్రకు బయల్దేరి వెళ్లారు. మానస సరోవరం యాత్రను ముగించుకుని అనంతరం ముక్తిథామం యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా వంతెన కూలడం తో మొత్తం 30మంది యాత్రీకులు చిక్కుకుపోయారు.